జాక్‌పాట్ కొట్టిన ముగ్గురు నానీలు
151 మంది ఎమ్మెల్యేలతో ఘన విజయం సాధించిన వైసీపీ 25 మంది మంత్రులతో తాజాగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ ఆచితూచి మంత్రుల పేర్లను ఖరారు చేశారు. రేపు ఉదయం 11.49 గంటలకు వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో నూతన మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజా మంత్రివర్గంలో ఆనూహ్యంగా ముగ్గురు ‘నాని’లకు చోటు దక్కడం విశేషం. వారే కొడాలి నాని, పేర్ని నాని, […]
151 మంది ఎమ్మెల్యేలతో ఘన విజయం సాధించిన వైసీపీ 25 మంది మంత్రులతో తాజాగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ ఆచితూచి మంత్రుల పేర్లను ఖరారు చేశారు. రేపు ఉదయం 11.49 గంటలకు వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో నూతన మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజా మంత్రివర్గంలో ఆనూహ్యంగా ముగ్గురు ‘నాని’లకు చోటు దక్కడం విశేషం. వారే కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని. వారి రాజకీయ నేపథ్యం ఓసారి చూస్తే…
కొడాలి నాని..
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) నాలుగోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లోనే హ్యాట్రిక్ రికార్డు నమోదు చేసిన ఆయన నాలుగోసారి విజయం సాధించి తనకు తిరుగులేదనిపించుకున్నారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004, 2009లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన నాని తర్వాత వైసీపీలో చేరారు. 2014లో ఆ పార్టీ తరపున గెలుపొందారు. తాజా ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేశారు.
ఆళ్లనాని..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆళ్లనాని వరుసగా మూడో సారి విజయం సాధించారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్ల నాని వరుసగా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఆళ్ల నాని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయన సమీప ప్రత్యర్ధి, మరడాని రంగారావుపై 33,053 ఓట్ల మెజార్టీని సాధించారు. 2009 ఎన్నికల్లో ఆళ్ల సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం అభ్యర్థి బడేటి బుజ్జిపై 13,682 ఓట్ల మెజార్టీని సాధించారు. 2014లో నిర్వహించిన ఎన్నికల్లో ఆళ్ల నాని వైసీపీ తరఫున పోటీ చేశారు. మరోసారి బడేటి బుజ్జిపై పోటీ చేయగా..నాని ఓటమి పాలయ్యారు. బడేటి బుజ్జికి ఆ ఎన్నికల్లో 24780 ఓట్ల మెజార్టీ లభించింది. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో ఆళ్ల నాని వైసీపీ తరఫున పోటీచేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జిపై ఆళ్ల నానికి 4072 ఓట్లు మెజార్టీ దక్కింది.
పేర్ని నాని..
కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వైసీపీ అభ్యర్థి పేర్ని వెంకట రామయ్య ( నాని) సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై 5,590 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో 15 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైన పేర్ని నాని..తాజా ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు తనకు అనుకూలంగా మారతాయని ఆయన ప్రగాఢ నమ్మకంతో ఉండేవారు. తాజాగా అదే నిరూపితమైంది. సామాజికంగానూ ఆర్థికంగానూ ఇద్దరు ప్రత్యర్థూలు బలంగా ఉండడం, ఇద్దరూ వివాదాలకు దూరంగా ఉండడంతో పోటీ కూడా అదే స్థాయిలో జరిగింది. చివరకు పేర్ని నాని మరోసారి విజయం సాధించారు.