Tragedy: బతికున్న వ్యక్తిపై మట్టి కప్పేశారు..కాపాడే క్రమంలో చంపేశారు..!
తమిళనాడులో అత్యంత విషాదకర ఘటన జరిగింది. మధురైలో ఓ వ్యక్తి అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. మధురైలోని విలాంగుడి ప్రాంతంలో రామమూర్తి నగర్ వద్ద డ్రైనేజి పైపుల పని జరుగుతోంది.
తమిళనాడులో అత్యంత విషాదకర ఘటన జరిగింది. మధురైలో ఓ వ్యక్తి అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. మధురైలోని విలాంగుడి ప్రాంతంలో రామమూర్తి నగర్ వద్ద డ్రైనేజి పైపుల పని జరుగుతోంది. సతీష్ అలియాస్ వీరనన్ అనే కార్మికుడు కూడా ఈ పనిలో ఉన్నాడు. అయితే, 11 అడుగుల గుంతలో ఉన్న సతీష్ ను గమనించకుండా, పైపులపై మట్టి కప్పేశారు సహాచర కూలీలు. దీంతో ఆ గుంతలో మట్టి కింద అతను చిక్కుకుపోయాడు. కాసేపటి తర్వాత సతీష్ ను కూడా తాము పూడ్చేశామని గ్రహించిన ఇతర కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడే ఉన్న ఓ జేసీబీ సాయంతో ఆ గుంతను తిరిగి తవ్వడం ప్రారంభించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ జేసీబీ హ్యాండ్ తగిలి సతీష్ తల తెగిపోయింది. ఈ ఘటనలో సతీష్ మృతి చెందడంతో తోటి కూలీలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అగ్నిమాపక దళ సిబ్బంది అక్కడికి వచ్చేసరికి ఘోరం జరిగిపోయింది.
నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైట్ ఇంజినీర్ సికందర్, సూపర్ వైజర్ బాలు, జేసీబీ ఆపరేటర్ సురేశ్ లను అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడు సతీష్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. సతీష్ మృతితో అతని కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.