సామ్యవాద గొంతుక సర్దార్‌ సర్వాయి పాపన్న

హాస్తిన పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన తొలి తెలుగు తేజం. గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీశాలి. ఔరంగజేబుకే ముచ్చమటలు పట్టించిన పోరాట యోధుడు. బడుగు, బలహీన, పేదల పాలిట ఆపద్బాంధవుడు... సమసమాజ స్థాపన సాధనకు ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడు. రాజరికంలో వికసించిన సామ్యవాద గొంతుక సర్దార్‌ సర్వాయి పాపన్న. నేడు ఆయన 370వ జయంతి. ఈ సందర్భంగా ఆ మహావీరుడి యాదిలో..!

సామ్యవాద గొంతుక సర్దార్‌ సర్వాయి పాపన్న
Follow us

|

Updated on: Aug 18, 2020 | 1:26 PM

హాస్తిన పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన తొలి తెలుగు తేజం. గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీశాలి. ఔరంగజేబుకే ముచ్చమటలు పట్టించిన పోరాట యోధుడు. బడుగు, బలహీన, పేదల పాలిట ఆపద్బాంధవుడు… సమసమాజ స్థాపన సాధనకు ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడు. రాజరికంలో వికసించిన సామ్యవాద గొంతుక సర్దార్‌ సర్వాయి పాపన్న. నేడు ఆయన 370వ జయంతి. ఈ సందర్భంగా ఆ మహావీరుడి యాదిలో..!

గోల్కొండ ఖిల్లాపై విజయ పతాకాన్ని ఎగురేయడమే లక్ష్యంగా తుదివరకు పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్‌. సర్వాయి పాపన్న చరిత్ర ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే కాదు, ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోని జానపద కళాకారుల ఆటపాటల్లో సజీవమై ప్రజల నాల్కల మీద పాటై ప్రవహించి పది తరాలను దాటి నేటి తరానికి సర్వాయి పాపన్న చరిత్రను పదిలపరిచి, ప్రజల గుండెల్లో నిలిపిన ఘనత మన ప్రజల జానపద కళారూపాలకె దక్కిందన్న సత్యం మరువలేనిది. ఆరోజుల్లోనే మచిలీపట్నం ఓడరేవు నుండి డచ్, ఫ్రెంచి వాళ్ళ నుంచి ఆధునిక ఆయుధాలను కొనుగోలు చేసి యుద్ధతంత్రం ద్వారా మొఘలు పాలకుపై దండెత్తి గోలుకొండను జయించిన గౌడ మహా వీరుడి చరిత్ర మట్టిలో మణిదీపంగా చరిత్ర పొరల్లో దాగి ఉంది.

జన హృదయంలో అతనొక సర్దార్‌. చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్‌ మీరు సాహెబ్‌…వీరంతా ఆయన ప్రధాన అనుచరులు. పన్నెండు మందితో మొదలైన ఆ పోరాటం, పన్నెండు వేల మంది సైన్యంగా అవతరించింది. అదంతా పాపన్న నాయకత్వంలో రూపొందిన సైన్యమే. ‘‘అమ్మా! తాటిచెట్టు ఎక్కను. లొట్టి పట్టను. గోల్కొండ పాలనా పగ్గాలు పట్టడమే నా జీవిత ఆశయం’’ అని తన తల్లి సర్వమ్మకు పాపన్న మాటిచ్చినట్లు చారిత్రక అధ్యయనకారుల రచనల ద్వారా వెల్లడవుతుంది. పాపన్న రాజ్యపాలన, చరిత్రను భావితరానికి అందకుండా భూస్థాపితం చేశామనుకున్నారు. కానీ పాపన్న చరిత్ర శుద్ధి చేసిన విత్తనమై లండన్ మ్యూజియంలో సజీవంగా బయటపడింది. సర్వాయి పాపన్న చరిత్ర నేటి తరానికి పదిలపరిచి, ప్రజల గుండెల్లో నిలిపిన ఘనత మన ప్రజల జానపద కళారూపాలకె దక్కిందన్న సత్యం మరువలేనిది. పాపన్న చరిత్రను దేశంలోని పాలకులు, ఆదిపత్య సామాజికవర్గం కనీసం తెలంగాణ గడ్డమీద కూడ ప్రజలకు తెలియకుండా జాగ్రత్తపడినప్పటికీ సర్వాయి పాపన్న చరిత్ర భారత ఉపఖండం దాటి, యూరప్ ఖండంలో పుస్తక రూపంలో ప్రపంచానికి అందించిన ఘటన రిచర్డ్ మాక్స్ వెల్ ఈటెన్ కు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి దక్కింది. దక్షిణ భారతదేశంలోని ఎనిమిది మంది మహనీయుల చరిత్రను “సోషల్ హిస్టరీ ఆఫ్ డక్కన్ : 8 ఇండియన్ లైవ్స్” పేర ఒక చారిత్రక గ్రంథాన్ని అరిజోన విశ్వవిద్యాలయానికి చెందిన రిచర్డ్ మాక్స్ వెల్ ఈటెన్ ఈ పుస్తకాన్ని రచించితే, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రెస్ వారు 2005లో పుస్తకాన్ని విడుదల చేశారు. అంతేకాదు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని లండన్ విక్టోరియా మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం వుంచారు.

ఛత్రపతి శివాజీ మహరాజ్, సర్దార్ సర్వాయి పాపన్న కన్న 20 సంవత్సరాలు ముందు జన్మించారు. 1674లో శివాజీ మహరాజ్ రాజుగా ప్రకటించుకుంటే, ఇంచుమించు ఇదే కాలంలోనే సర్దార్ సర్వాయి పాపన్న 1675 సంవత్సరంలో ఖలాషాపూర్ ను రాజధానిగా చేసుకొని సర్వాయి పాపన్న తన రాజ్య స్థాపన గావించి, పాలన ప్రారంభించరు. ఇద్దరూ ఆనాటి సామాజిక పరిస్థితులలో వర్ణాశ్రమ ధర్మం బలంగా అమలు జరుగుతున్న సాంప్రదాయాన్ని కాలరాచి కత్తిపట్టి యుద్ధం చేసిన యోధులు. సర్వాయి పాపన్న సుమారు 30 ఏళ్లపాటు స్వయం పాలన చేశారు. శివాజీ మహరాజ్ కూడా 20 సంవత్సరాలకుపైగా రాజ్యపాలన చేశారు. కాని, ఛత్రపతి శివాజీకి దేశ చరిత్రలో దక్కిన స్థానం సర్దార్ సర్వాయి పాపన్నకు దక్కలేదు. కనీస చారిత్రక ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. ఛత్రపతి శివాజీ మొఘల్ చక్రవర్తుల సైన్యానికి, పాలనకు వ్యతిరేకంగా, అదే సమయంలో స్వంత దేశ ఆదిపత్య సామాజిక వర్గాల కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అదే సమయంలో సర్దార్ సర్వాయి పాపన్న కూడా మొఘల్ చక్రవర్తుల ఆదీనంలోని గోల్కొండ సుబేదార్ల సైన్యంతో, తెలంగాణలో జమిందార్లు, జాగీర్దార్లు, దేశ్ ముఖులు, భూస్వాములతో ఏకకాలంలో యుద్ధం చేసి తన రాజ్యపాలన గావించారు. 1874 సంవత్సరంలోనే మొదటిసారిగా బ్రిటీష్ చరిత్రకారుడు జె.ఏ.బోయల్ తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడి జానపద పాటల్లో వున్న పాపన్న చరిత్రను వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి పరిచయం చేశారు.

350 సంవత్సరాల క్రితమే సర్వాయి పాపన్నకు సిద్ధాంతాలు తెలియవు. ప్రపంచ విప్లవాల అధ్యయనం అసలు లేదు. ఉన్నత రాజరిక వంశ పారంపర్యం లేదు. ఒక సామాన్య కుటుంబ కులవృత్తి నేపథ్యం కలిగి, కల్లుగీత కార్మికునిగా జీవనం సాగిస్తున్న సగటు మనిషి సర్దార్ సర్వాయి పాపన్న. కుతుబ్‌షాహీ రాజ్యాన్ని ఓడించిన ఔరంగజేబు 1687లో గోల్కొండ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అదే సమయంలో ప్రాంతాల వారీగా జాగిర్దారు, సుబేదారుల పదవుల్లో తన మనుషులను నియమించి, వాళ్లకు పరిపాలనా బాధ్యతలు అప్పగించాడు. ఆనాటి బలమైన మొఘల్ చక్రవర్తుల నిరంకుశ పాలనను, స్థానిక జమిందారులు, జాగీర్ దారులు, దేశ్ ముఖ్ లు, భూస్వాముల దోపిడిని, దౌర్జన్యాన్ని ఎదిరించి, యుద్ధం చేసి సామాజిక న్యాయపాలన స్థాపించి, ప్రజలను ఆనాటి పాలకుల దోపిడి, దౌర్జన్యం, నిరంకుశ పాలన నుంచి విముక్తి చేశారు. ఆనాటి ప్రజల కష్టాలు, కన్నీళ్లు సర్వాయి పాపన్నను యుద్ధానికి, వీరమరణానికి ఉసిగొల్పాయి. అదే సమయంలో ఆనాటి బలమైన మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొనడం, స్థానిక జమిందారులను, భూస్వాములతో యుద్ధం చేయడానికి తన ఒక్కనితో, తన ఒక్క కులంతో సాధ్యం కాదని తెలుసుకొని, సబ్బండ వృత్తుల పీడిత ప్రజలను, యువకులను సమీకరించుకొని చిన్నదండుతో ప్రారంభించి, 12 వేల సైన్యాన్ని, పదాతి, అశ్విక, పిరంగి, రహస్యగూఢాచారి వ్యవస్థ కలిగిన బలమైన సైన్యాన్ని ఏర్పరుచుకున్నాడు. సైన్యాన్ని కూడగట్టి గెరిల్లా పోరాటం ద్వారా తన స్వస్థలం ఖిలాషాపూర్‌ రాజధానిగా పాలన సాగించాడు. భువనగిరి కోటను వశం చేసుకొని సుమారు రెండు దశాబ్దాల పాటు ఏలాడు.

లొట్టిపట్టే చేతితో ఆయుధం ధరించి రాచరికంలో సామ్యవాద సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించాడు. సర్దార్ సర్వాయి పాపన్న ఆ కాలంలోనే ఒక రాజ్యానికి వుండవలసిన అన్ని హంగులను, సమకూర్చుకొని, డచ్, ఫ్రెంచ్ దేశాల నుంచి ఆధునిక ఆయుధాలను కొనుగోలు చేసి, సంపదలను సమకూర్చుకొని, 20వేలకుపైగా కోటలను నిర్మించి, గెరిల్లా యుద్ధతంత్రంలో శత్రువు బలంగా వున్నప్పుడు నాలుగు అడుగులు వెనక్కి వేసి, శత్రువుపై ఆకస్మిక దాడులు జరిపి, గోల్కొండ కోటను సైతం జయించి, పాపన్న తన రాజ్యాన్ని భువనగిరి, నల్లగొండ, తాటికొండ, వరంగల్, కొలనుపాక, చెరియాల, కీరంనగర్, హుజూర్ నగర్, హుస్నాబాద్ ప్రాంతాలను సుమారు 30 ఏళ్లు పరిపాలించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నవి.

మొగలాయిలకు వ్యతిరేకంగా పోరాడిన పాపన్న 1709లో కన్నుమూశారు. ఆయన మరణంపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. శత్రువుల చేతిలో కన్నుమూయడాన్ని అవమానంగా భావించిన పాపన్న తన బాకుతో తానే శిరచ్ఛేదనం చేసుకున్నాడని ప్రచారంలో ఉంది. దక్కన్‌ రాజ్యంపై ఢిల్లీ పెత్తనాన్ని ధిక్కరించి గోల్కొండ ఖిల్లాపై స్వతంత్య్ర బావుటా ఎగరేసిన సర్దార్‌ సర్వాయి పాపన్న పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకం. సమకాలీన రాజకీయాలకూ ఆయన ధిక్కార బాట ఆదర్శనీయం.