AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదేళ్లుగా తల్లిదండ్రుల రాకకోసం ఎదురుచూస్తున్న బాలిక

ఆ బాలిక ఐదేళ్ల వయసులో కుటుంబసభ్యులకు దూరమైంది. కన్నవారి రాక కోసం పదేళ్లుగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది. తనవాళ్లు ఎప్పుడొస్తారా.. తనను ఇంటికి తీసుకెళ్తారని ఆశగా నిరీక్షిస్తోంది.

పదేళ్లుగా తల్లిదండ్రుల రాకకోసం ఎదురుచూస్తున్న బాలిక
Balaraju Goud
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 2:47 PM

Share

ఆ బాలిక ఐదేళ్ల వయసులో కుటుంబసభ్యులకు దూరమైంది. కన్నవారి రాక కోసం పదేళ్లుగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది. తనవాళ్లు ఎప్పుడొస్తారా.. తనను ఇంటికి తీసుకెళ్తారని ఆశగా నిరీక్షిస్తోంది. తల్లిదండ్రులు రాకకోసం ఎదురుచూపులతోనే కాలం వెళ్లదీస్తోంది. రోజులు గడుస్తున్నా కొద్ది నిరాశే మిగులుతోంది. అయితే, ఇంతకాలం చేరదీసిన జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ అధికారులు బాలికను దత్తత ఇచ్చేందుకు సిద్ధమవ్వడంతో ససేమిరా అంటోంది. వెళ్తే తల్లిదండ్రుల వద్దకు తప్పా ఎక్కడికి వెళ్లనని భీష్మించింది. తన తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని విజ్ఞప్తి మేరకు అధికారులు వారి జాడకోసం అన్వేషిస్తున్నామని గుంటూరు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ఏపీడీ బి.మనోరంజని తెలిపారు.

పిడతల కుమారి (15)అనే బాలిక ఐదేళ్ల వయసులో గుంటూరు రాజాగారితోటలోని బాలలు, పోలీస్‌ వసతి గృహంలో ఆమె అక్క చేర్చినట్లు కుమారి తెలిపింది. అయితే ఆ సమయంలో బాలిక వివరాలను సిబ్బంది సరిగా నమోదు చేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఎవరనేది పూర్తి వివరాలు తెలియడంలేదు. బాలికను చేర్పించిన ఆమె అక్క రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో బాలల సంక్షేమ సమితి నిర్ణయం మేరకు గుంటూరు జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమాల్లో వసతి కల్పించారు. ప్రస్తుతం బాలిక 9వ తరగతి చదువుతోంది. అయితే, బాలిక దత్తత వెళ్లేందుకు మాత్రం అంగీకరించడంలేదు. తన తల్లిదండ్రుల జాడ తెలిస్తే వెళ్తానంటోంది.

కాగా, తన కుటుంబసభ్యులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేకపోతోంది. నరసరావుపేట పట్టణంలోని ఓ బ్రిడ్జి వద్ద ఉండేవారని కుమారి చెబుతోంది. వారి పేర్లు కూడా సరిగా చెప్పలేకపోతోంది. లేదంటే, నిడుబ్రోలులోని శాంధోమ్‌ కరుణాలయంలో ఉండి చదువుకుంటానని విజ్ఞప్తి చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను గుర్తిస్తే.. తగిన ఆధారాలతో తనను సంప్రదించాలని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ఏపీడీ బి.మనోరంజని కోరారు. సమాచారం కోసం జిల్లా బాలల పరిరక్షణాధికారి టి.నాగకోటేశ్వరరావును ఫోన్‌ 83329 80968 నంబరులో సంప్రదించాలన్నారు.