Watch: ‘ఇది కవితల్లో రాసేంత గొప్ప ప్రేమ.. ఇంట్లో ఉండలేను.. ఆమె జ్ఞాపకాలు వెంటాడుతాయి’
భార్య మరణించిన తర్వాత కూడా ఆమె జ్ఞాపకాలను తనతోనే ఉంచుకున్న ఈ ఆటో డ్రైవర్‌కు పిల్లలు, మనవళ్లు ఉన్నప్పటికీ ఆమెను మరిచిపోలేకపోతున్నాడు. ఇంట్లో ఖాళీగా ఉంటే బాధ ఎక్కువగా గుర్తుకొస్తుందని, అందుకే ఆటో నడుపుతూ కొత్త వ్యక్తులను కలవడం తనకు ధైర్యాన్ని ఇస్తుందని చెబుతున్నాడు. ఆయన ప్రేమ, అంకితభావం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు..

కాలం పగతో జంటను విడదీసి, వీడ్కోలు చెప్పినంత మాత్రాన ప్రేమ ముగియదని నిరూపిస్తున్నాడు బెంగళూరుకు చెందిన ఓ వృద్ధ ఆటో డ్రైవర్. భార్యను కోల్పోయి ఎనిమిదేళ్లు గడిచినా.. ఆమె జ్ఞాపకాలను తన జీవితంలో భాగంగానే భావిస్తూ ప్రతిరోజూ ఆమె ఫొటోలకు పూలు సమర్పిస్తున్నాడు. ఆయన చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని ఇందిరానగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. అసిష్ మాథ్యూ అనే కంటెంట్ క్రియేటర్ ఈ వృద్ధ ఆటో డ్రైవర్‌ను కలుసుకున్నారు. ఆటోలో కూర్చుని పూలను అందంగా అమర్చుకుంటున్న ఆయన్ను చూసి ఆసక్తితో మాట్లాడారు.
ఆటో స్టీరింగ్ పైన ఉంచిన ఫొటోల వైపు చూపిస్తూ ఆ డ్రైవర్.. ‘ఆమె నా భార్య’ అని చెప్పారు. ఎనిమిదేళ్ల క్రితం తన భార్య మరణించిందని, కానీ ఆమె జ్ఞాపకాలు తనను ఎప్పటికీ విడిచిపెట్టవని తెలిపారు. తనకు కుమారుడు, కోడలు, ఆరుగురు మనవళ్లు ఉన్నారని చెప్పిన ఆయన.. కుటుంబం ఉన్నప్పటికీ భార్యను మర్చిపోలేకపోతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఆటోలో అన్ని వైపులా తన భార్య ఫొటోలను ఏర్పాటు చేసుకున్నారు. తన కుమారుడు ఆటో నడపడం మానేసి ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడని ఆయన తెలిపారు. అయితే ఒంటరిగా ఇంట్లో ఉంటే భార్య జ్ఞాపకాలు ఎక్కువగా వేధిస్తాయని, కొత్త వ్యక్తులను కలవడం, పనిలో బిజీగా ఉండటం తనకు మనశ్శాంతినిస్తుందని చెప్పారు. ‘ఇంట్లో ఉంటే ఎక్కువగా ఆలోచిస్తాను.. అందుకే ఆటో నడుపుతాను8 అని ఆయన చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి.
View this post on Instagram
ఈ వీడియో చూసిన నెటిజన్లు వృద్ధ ఆటో డ్రైవర్ ప్రేమను కొనియాడుతున్నారు. డబ్బుతో కొనలేని ప్రేమకు ఇది నిదర్శనమని పలువురు కామెంట్లు చేశారు. ‘ఇలాంటి ప్రేమను పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు’ అని ఒకరు వ్యాఖ్యానించగా.. ‘ఇది కవితల్లో రాసేంత గొప్ప ప్రేమ’ అని మరొకరు స్పందించారు. మరో నెటిజన్ మాట్లాడుతూ.. ‘ఈ అంకుల్ మా ఇంటి పక్కనే ఉంటారు. ప్రతిరోజూ ఉదయం మొదట ఆటోను శుభ్రం చేసి పూలతో అలంకరిస్తారు’ అని తెలిపారు. భార్యపై ఆయన చూపిస్తున్న ఈ ప్రేమ, అనుబంధం.. ఈ కాలంలో ఉదయం పెళ్లి చేసుకుని సాయంత్రానికి విడాకులు తీసుకునే జంటలకు, క్షణికావేశంలో ఒకరిని ఒకరు చంపుకునే దంపతులకు ఆదర్శం కావాలి.
