నీ ఇంటికొస్తా.. నీ నట్టింటికొస్తా.. ఇలాంటి డైలైగ్స్ సినిమాల్లోనే విన్నాం. కానీ.. సేమ్ సీన్ అనంతలో మాత్రం నూటికి నూరుశాతం జరిగిపోయింది. ఒక ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే ఇంటికెళ్లి ఎటాక్ చేశారు.. ! ఆయన ఇంటి ముందు ఉన్న అనుచరులపై దాడి చేశారు. ఇదీ.. తాడిపత్రి నేతలు పెద్దారెడ్డి Vs ప్రభాకర్‌రెడ్డి మధ్య రగులుతూనే ఉన్న యుద్ధంలోని కొత్త అంకం. అటు, ఇటు తేడావస్తే తొడగొట్టే తాడిపత్రి… వైరివర్గాల ఘర్షణతో మళ్లీ ఉద్రిక్తంగా మారింది. తన సతీమణిపై సోషల్‌మీడియాలో అసత్యప్రచారం చేస్తున్నారన్న ఆగ్రహంతో.. అనుమానితులపై తన అనుచరులతో కలిసి దాడిచేశారు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి. బయటెక్కడో కాదు…ఏకంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికెళ్లిమరీ ఆయన అనుచరులపై దాడికి దిగారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వచ్చిన సమయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో లేరు. తర్వాత విషయం తెలిసి ఆయన ఇంటికి చేరుకునేసరికి పెద్దసంఖ్యలో మద్దతుదారులు గుమిగూడారు. తన ఇంటిపై ఎమ్మెల్యే దాడికి వస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు భారీగా మోహరించారు.
ఏకంగా తమ నాయకుడి ఇంటిపైకే ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడికి దిగటంతో ఆవేశంతో ఊగిపోయారు జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు. రెండు వర్గాల మధ్య ఘర్షణతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రెండువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. జేసీ అనుచరులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కారును ధ్వంసం చేశారు. డీఎస్పీ వాహనంపైనా జేసీ అనుచరులు దాడికి దిగారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు రెండువర్గాలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఫలితంగా తాడిపత్రిలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ముందునుంచీ జేసీ, పెద్దారెడ్డి వర్గాల మధ్య ఘర్షణవాతావరణం ఉంది. జేసీ కుటుంబసభ్యులు ఓడిపోయి, పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక తరచూ రెండువర్గాల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది.