Telangana: ఇసుక దీవిలో అద్భుతం.. కాకులు దూరని కారడవిలో మతి పొగుడుతున్న “బ్లాక్ బెర్రీ” ఐలాండ్.. ఎక్కడో తెలుసా..?
అందాల ద్వీపంలో ఆనందాల విహారం.. కారడవిలో ఇసుక దీవి.. ఆ ఇసుక దీవి మధ్య ఆధునిక గుడారాలలో బస చేస్తే ఎలా ఉంటుంది..! ఆ ఊహను నిజం చేసే ఆధునిక దీవి వచ్చేసింది..! తెలంగాణ టూరిజం సర్క్యూట్ ములుగు జిల్లా అడవుల్లో రూపుదిద్దుకున్న "బ్లాక్ బెర్రీ" దీవి రా రమ్మంటోంది..! బ్లాక్ బెర్రీ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..!
డిఫరెంట్ థీమ్స్‌తో ఎంజాయ్ చేయాలని తహతహలాడే ప్రతి ఒక్కరు ప్రకృతి అందాలను అన్వేషిస్తూ ఎక్కడెక్కడికో పరుగులు పెడుతుంటారు. కాస్త ఖరీదైన పర్వాలేదు.. అక్కడికి కుటుంబ సమేతంగా వెళ్లి తనివితీరా ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు విదేశాలకు వెళ్లి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇసుక దీవుల్లో ఎంజాయ్ చేయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది.
అయితే అలాంటి కోరికను నిజం చేసే అవకాశం ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది. తెలంగాణలో మొట్టమొదటి ఇసుక దీవి “బ్లాక్ బెర్రీ” ఐలాండ్ నిర్మాణమైంది. కాకులు దూరని కారడవిలో రూపుదిద్దుకున్న బ్లాక్ బెర్రీ ఐలాండ్ చూపరులను ఆహా అనిపిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, గుట్టలు, పక్షుల కిలకిల రావాలు.. దీవి పక్కనే జాలువారుతున్న వాగు జల సవ్వడి.. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్ నిర్మినమైంది.
తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఐలాండ్ ఇది..! సహజ అందాలకు నిలయమైన ములుగు జిల్లాలో పర్యాటక శాఖ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకొచ్చారు. అభయ అరణ్యంలో ముస్తాబైన అందాల దీవి “బ్లాక్ బెర్రీ” ఐలాండ్ అట్టే మనసు దోచుకుంటుంది. ములుగు జిల్లాలో దట్టమైన అడవులు ఉన్న తాడ్వాయి – పస్రా మధ్య రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్‌ను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి నుండి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్లాలి. అక్కడ కనీసం సెల్ సిగ్నల్, విద్యుత్ సరఫరా కూడా ఉండదు. పూర్తిగా ఇసుక దిబ్బమీద మీద ఈ ఐలాండ్ రూపొందించారు.
దట్టమైన అడవిలో ముస్తాబైన బ్లాక్ బెర్రీ ఆందాల విహారం పర్యాటకులను రారమ్మంటూ ఆహ్వానం పలుకుతోంది. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో బ్లాక్ బెర్రీ ఐలాండ్ రూపుదిద్దుకుంది. తాడ్వాయి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని మొండ్యాలతోగు వాగు పక్కనే ఈ బ్లాక్ బెర్రీ దివిని ఏర్పాటు చేశారు. ఇసుక దిమ్మలపై ప్రత్యేక గుడారాలను ఏర్పాటు చేశారు. జపాన్ టెక్నాలజీతో తయారు చేసిన ఆధునిక గుడారాలను ఇక్కడ సిద్ధం చేశారు. పర్యాటకుల విడిది కోసం మొత్తం 50 ఆధునిక గుడారాలను సిద్ధం చేశారు. వీటి సందర్శనకు వస్తున్న స్థానికులు ఈ దీవి అందాలను చూసి వాహ్ అంటున్నారు.
బ్లాక్ బెర్రీ దీవిలో మొత్తం 50 ఆధునిక గుడారాలు ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 25 గుడారాలలో ఇద్దరు బస చేయవచ్చు. మరో 21 గుడారాలలో ముగ్గురు, మరో నాలుగు గుడారాలలో నలుగురు కుటుంబ సమేతంగా విడిది చేసేవిధంగా ఆధునిక టెక్నాలజీతో ఈ గుడారాల రూపొందించారు. వన్యప్రాన్ల నుండి ఎలాంటి నష్టం కలగకుండా చుట్టూ ప్రత్యేక వలయం ఏర్పాటు చేశారు.
దండకారణ్యలో నిర్మించిన బ్లాక్ బెర్రీ ఐలాండ్ వద్ద విద్యుత్ సరఫరా ఉండదు. ఇక్కడ సోలార్ పవర్‌తో ప్రత్యేకంగా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూపొందించిన బ్లాక్ బెర్రీ ఐలాండ్‌కు చుట్టూ నిత్యం అగ్గి వెలిగేలా ఫైర్ ల్యాంప్స్ ఏర్పాటు చేశారు. మంటలు ఉండడం వల్ల ఎలాంటి వన్యప్రాణులు ఇక్కడికి రాకుండా ప్రత్యేక భద్రత చర్యలు తీసుకున్నారు. ఇందుో భాగంగా ఈ ఫైర్ ల్యాంప్స్ ను రూపొందించారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకమైన భోజనశాల, ఇసుక దీవిలో ఎంజాయ్ చేయడం కోసం గేమ్స్ జోన్, సౌండ్ అండ్ లైటింగ్, బీచ్ బాల్, చిన్నారుల ఆటలకు ప్రత్యేక జోన్స్ ఏర్పాటు చేశారు. చీకటి పడితే చాలు విద్యుత్ దీపాల కాంతులు, లైటింగ్, సౌండ్స్ అబ్బుర పరుస్తాయి.
ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు లక్నవరం, రామప్ప, బొగత జలపాతాలు, లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, మేడారం సందర్శనకు వచ్చే పర్యాటకులు ఇక్కడ బ్లాక్ బెర్రీ అడవుల్లో రాత్రి బస చేస్తే ఆ కిక్కే వేరు అనిపించేలా ఈ అందాల దీవిని సిద్ధం చేశారు. బ్లాక్ బెర్రీ ఐలాండ్ పక్కనే అటవీ శాఖ నిర్మించిన మూడంతస్తుల వాచ్ టవర్ ఉంటుంది. ఈ వాచ్ టవర్ పైకెక్కితే చుట్టూ కొండలు, ఆకుపచ్చ వర్ణం కనువిందు చేస్తుంది.
డిసెంబర్ 30వ తేదీన ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలోనే బ్లాక్ బెర్రీ ఐలాండ్ సందర్శించిన మంత్రి సీతక్క, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అక్కడ కాసేపు సందడి చేశారు. ఆటలు ఆడి కాసేపు సేద తీరారు. ఎక్కడో విదేశాలలో కనిపించే ఇలాంటి ఆధునిక దీవులు మన ప్రాంతంలో అందుబాటులో రావడం ఒక వరం అని మంత్రి సీతక్క అన్నారు. ఇలాంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో మద్యం, ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతిఒక్కరూ ఇక్కడ ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపడతామని ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వీడియో చూడండి…
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..