తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ మారబోతున్నారా? త్వరలోనే గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? ఇప్పటికే సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎల్ రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. పార్టీలోకి చేర్చుకునేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ మేరకు ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంప్రదింపులు జరిపారట. త్వరలో ఇద్దరి మధ్యా మరోసారి చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్.రమణకు బీసీ నేతగా, సౌమ్యుడిగా మంచి గుర్తింపు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఎల్.రమణ… రాష్ట్ర విభజన తర్వాత నుంచి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. కాగా పార్టీ మార్పు అంశంపై ఎల్ రమణ స్పందించారు. జూన్ 1 న తాను బెంగుళూరులో ఉండగా ఎర్రబెల్లి ఫోన్ చేశారని చెప్పారు. సీఎం గుర్తు చేసుకున్నట్లు ఎర్రబెల్లి తనతో అన్నారని.. ఆస్పత్రి పనిపై బెంగళూరు వచ్చినట్టు చెప్పానని రమణ తెలిపారు. పార్టీ మారడంపై ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
త్వరలో ఎమ్మెల్యేల కోటాలో 6, గవర్నర్ కోటాలో 1 ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో గులాబీ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం అందుతోంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో అభిమానులు, కార్యకర్తలతో చర్చించి ఎల్ రమణ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read: పెళ్లి పందిట్లో ప్రియుడు.. పీటలపై నుంచి అతడితో వధువు ఛాటింగ్.. కట్ చేస్తే..