తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 79,824 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. కొత్తగా 6,026 పాజిటివ్ కేసులువెలుగుచూశాయి. అయితే పలు జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉంది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1,115 కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 418, రంగారెడ్డి జిల్లాలో 403 కేసులు, నల్గొండ జిల్లాలో 368, సంగారెడ్డి జిల్లాలో 235 రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,75,748కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా మహమ్మారి కారణంగా 52 మంది ప్రాణాలు విడిచారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు చనిపోయినవారి వారి సంఖ్య 2,579కి చేరింది. కరోనా బారి నుంచి బుధవారం ఒక్క రోజు 6,551 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కాగా హైదరాబాద్ పరిధి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లన్నీ దాదాపు నిండిపోయాయి. పరిస్థితి విషమించి ఎవరినైనా చేర్చాల్సి వస్తే బెడ్ దొరకడం కష్టతరంగా మారింది. పరిస్థితులు అదుపుతప్పినట్లు అర్థమవుతుంది. హైదరాబాద్‌లోని గాంధీతోపాటు టిమ్స్, కింగ్‌కోఠి, చెస్ట్ హాస్పిటల్, ఈఎస్ఐ, నిమ్స్, రైల్వే ఆసుపత్రి… ఇలా అన్నింటిలోనూ బెడ్స్ పూర్తిగా నిండిపోయాయి. ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ పడకలను కూడా వెంటిలేటర్ బెడ్లుగా మార్చడంతో… కొన్ని ఖాళీలు ఉన్నట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్