Team India: 11 నెలలు, 20 వన్డేలు.. రోహిత్, విరాట్ ఫ్యూచర్ డిసైడ్ షెడ్యూల్ ఇదే..!
World Cup 2027: వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మే 2027 నాటికి టీమిండియా మొత్తం 20 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఈ సిరీస్‌లు అత్యంత కీలకం కానున్నాయి. అఫ్గానిస్తాన్‌తో ప్రారంభమయ్యే ఈ సుదీర్ఘ షెడ్యూల్ వివరాలు ఓసారి చూద్దాం..

World Cup 2027: వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా ఇప్పుడే కసరత్తులు మొదలుపెట్టింది. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత జట్టు తన వన్డే ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ముఖ్యంగా టీ20లకు స్వస్తి పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి సారించనున్నారు. వీరిద్దరూ ఫామ్ చాటుకుంటేనే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉండటంతో ప్రతి మ్యాచ్ ప్రాధాన్యత సంతరించుకుంది.
కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో యువ రక్తం, అనుభవజ్ఞుల కలయికతో పటిష్టమైన జట్టును రూపొందించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే అఫ్గానిస్తాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ వంటి జట్లతో తలపడనుంది.
అఫ్గానిస్తాన్‌తో సిరీస్ షెడ్యూల్..
జూన్ 2026లో అఫ్గానిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. మొదట ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన అనంతరం మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది.
మరిన్ని కీలక సిరీస్‌లు..
అఫ్గానిస్తాన్ సిరీస్ ముగిసిన తర్వాత భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలు ఆడుతుంది. అనంతరం సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఉంటుంది. వీటితో పాటు శ్రీలంక, జింబాబ్వేలతో కూడా టీమ్ ఇండియా చెరో మూడు వన్డేలు ఆడనుంది. అన్నింటికంటే ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగే 5 వన్డేల సిరీస్ భారత జట్టు తన బలాలతోపాటు బలహీనతలను పరీక్షించుకోనుంది.
| తేదీ | మ్యాచ్ | వేదిక | సమయం (IST) |
| జూన్ 6, 2026 | ఏకైక టెస్ట్ | ముల్లాంపూర్, చండీగఢ్ | ఉదయం 9:30 |
| జూన్ 14, 2026 | మొదటి వన్డే | ధర్మశాల | మధ్యాహ్నం 1:30 |
| జూన్ 17, 2026 | రెండో వన్డే | లక్నో | మధ్యాహ్నం 1:30 |
| జూన్ 20, 2026 | మూడో వన్డే | చెన్నై | మధ్యాహ్నం 1:30 |
వరల్డ్ కప్ లోపు ఆడే ఈ 20 మ్యాచ్‌లు రోహిత్, కోహ్లీల కెరీర్‌కు దిశానిర్దేశం చేయనున్నాయి. ఫిట్నెస్, రన్ రేట్ విషయంలో వీరిద్దరూ సత్తా చాటాల్సి ఉంటుంది. అభిమానులు కూడా తమ అభిమాన తారలను మళ్ళీ నీలి రంగు జెర్సీలో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
