ఢిల్లీ: బీజీపీ పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారంటూ రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలు బాధాకరమని సుష్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాహుల్‌జీ.. అద్వానీజీ మా తండ్రిలాంటి వారు. మీ మాటలు మమ్మల్ని తీవ్రంగా బాధించాయి. దయచేసి కాస్త మర్యాదగా మాట్లాడండి’అని ఆమె ట్వీట్ చేశారు.
రాజకీయ వ్యతిరేకులను భాజపా శత్రువులుగానో, దేశద్రోహులుగానే చూడదంటూ అద్వానీ ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు అద్వానీ వ్యాఖ్యలకు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. రాహుల్ కూడా దీనిపై స్పందిస్తూ.. ప్రధాని మోదీ, భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. హిందూమతంలో గురువులకు అత్యున్నత స్థానం ఉంటుందని, అలాంటి గురువును గౌరవించకపోవడం హిందూ ధర్మమేనా అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.