2018 నాటి ఎలక్టోరల్ బాండ్స్ పథకంఫై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ బాండ్స్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పురస్కరించుకుని.. దీనిపై సమాధానాన్ని దాఖలు చేసేందుకు కేంద్రానికి, ఎన్నికల సంఘానికి సీజేఐ ఎస్.ఎ. బాబ్డే, న్యాయమూర్తులు బీ.ఆర్. గవాయ్, సూర్యకాంత్ లతో కూడిన బెంచ్ రెండు వారాల వ్యవధినిచ్చింది. ఈ పథకంపై స్టే జారీ చేయవలసిందిగా కోరుతూ సీపీఐ(ఎం), అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఎడీఆర్) పిటిషన్ దాఖలు చేశాయి. 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఈ బాండ్ల వినియోగ మినహాయింపును 2017 లోఫైనాన్స్ చట్టం ప్రవేశపెట్టింది. ఈ చట్టంలోను, 2016 నాటి చట్టంలోను చేసిన కొన్ని సవరణలు విదేశీ కంపెనీలనుంచి కూడా అపరిమితంగా పార్టీలు రాజకీయ విరాళాలు సేకరించేందుకు అనువుగా కవాటాలు తెరిచే వీలు కల్పించాయని ఏడీఆర్ తో బాటు మరో ఎన్జీఓ కూడా తన పిటిషన్ లో ఆరోపించింది.
రాజకీయ విరాళాలకోసం ఎలక్టోరల్ బాండ్ల వినియోగం అన్నది ఆందోళన కలిగించే అంశమని ఇవి బేరర్ బాండ్ల తరహాలో ఉన్నాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. ఏడీఆర్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఈ పథకం కింద సుమారు 6 వేల కోట్లు సేకరించారని తెలిపారు. అయితే ఇందుకు రిజర్వ్ బ్యాంక్, ఎన్నికల కమిషన్ అంగీకరించలేదన్నారు. ఎన్నికలముందు అక్రమంగా ఈ పథకాన్ని తెచ్చారని ఆయన విమర్శించారు.