జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలకు అర్థాలే వుండవన్నారు ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత. అత్యాచారాలు చేసే వాళ్ళను రెండు దెబ్బలు కొట్టి, వదిలేయాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మైండ్‌లెస్ మాటలని విమర్శించారామె. మహిళలను హింసించిన వారిని బహిరంగంగా ఉరి తీసే దేశాల్లో సైతం ఇంకా మహిళలపై దాడులు జరుగుతున్నాయని, అలాంటిది రెండు దెబ్బలు కొట్టి వదిలేస్తే రేపిస్టులు భయపడతారా అని ప్రశ్నించారు సుచరిత. రేపిస్టులకు పవన్ కల్యాణ్ మద్దతు పలకడం హాస్యాస్పదమని ఆమె అన్నారు. ఆయన అవగాహన రాహిత్యానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారామె.
మహిళలపై పవన్ దృక్పధం ఈ వ్యాఖ్యల ద్వారా తెలిసిపోతోందని సుచరిత విమర్శించారు. అత్యాచార నేరాలకు వెంటనే శిక్ష అమలు చేయాలని ఏపీ హోం మంత్రి అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎవరితో ఉంటారో తెలియదని సెటైర్ వేశారామె. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదని చెప్పుకొచ్చారు సుచరిత. మహిళల రక్షణ విషయంలో ప్రత్యేక చట్టం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచిస్తున్నారని, త్వరలో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా మహిళల రక్షణకు మరిన్ని పకడ్బందీ చర్యలను తమ ప్రభుత్వం తీసుకుంటుందని సుచరిత వివరించారు.
గ్రామ స్వరాజ్యం తీసుకురావడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, గత ఆరు నెలల కాలంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారని సుచరిత చెప్పారు. రాబోయే రోజుల్లో నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్దికి ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆపరేషన్ తర్వాత కూడా పేషెంట్లకు ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆమె అన్నారు. త్వరలో 25 లక్షల మందికి ఇల్లు ఇవ్వడం ఖాయమని, జనవరి నుండి అమ్మఒడి పథకం అమలవుతోందని, రివర్స్ టెన్దరింగ్ ద్వారా ప్రజా ధనాన్ని కాపాడుతున్నామని చెప్పుకొచ్చారుు మేకతోటి సుచరిత.