లాభాలతో ముగిసిన దేశీ మార్కెట్లు
ముందురోజు జరిగిన నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. దేశీ జీడీపీ భారీ క్షీణత, చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో తీవ్ర ఆటుపోట్లను చవిచూశాయి.

Stock Markets : ముందురోజు జరిగిన నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. దేశీ జీడీపీ భారీ క్షీణత, చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో తీవ్ర ఆటుపోట్లను చవిచూశాయి. టెలికాం, మెటల్ షేర్ల అండతో లాభాల్లోకి జంప్ కొట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 273 పాయింట్లు లాభపడి 38,901 వద్ద ముగియగా, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 11,470 వద్ద స్థిరపడింది. రూపాయితో డాలర్ మారకం విలువ 72.86వద్ద కొనసాగుతోంది.
మంగళవారం ఉదయం మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 400 పాయింట్లు ఎగబాకి 39,027 పాయింట్లకు చేరగా, నిఫ్టీ కూడా 116 పాయింట్లు లాభపడి 11,504 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగించింది. కొద్దిసేపటికే ఒత్తిడికి లోనైన సెన్సెక్స్ 38,542 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుని చివరి వరకూ లాభాల్లోనే పయనించింది.
ఒకానొక దశలో 39,226 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్ చివరకు 273 పాయింట్ల లాభంతో 38,900 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి తీసుకొచ్చిన లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ ఏకంగా 23.9 శాతం కుంగినా.. మదుపర్లపై ఇది పెద్దగా ప్రభావితం చేయలేదు. దీన్ని ముందుగా అంచనా వేయడమే ఇందుకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ షేర్లు మినహా మిగిలిన రంగాలన్నీ లాభాపడ్డాయి.




