రేపు, ఎల్లుంటి తెలంగాణ అసెంబ్లీ, మండలి సెషన్స్ జరగనున్నాయి. మరోవైపు కరోనా భయపెడుతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు సమావేశాల నిర్వహణ ఎలా అన్నదానిపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
సభలో సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండే విధంగా అమర్చిన సీటింగ్ విధానం కొనసాగించాలని, శాసనసభ ప్రాంగణం, సభ లోపల పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. సెక్యూరిటీ మ్యాటర్స్‌పై బందోబస్తు పై CS, డీజీపీ, సిటీలతో మాట్లాడారు.
అలాగే కరోనా మహమ్మారి నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. సభ్యులు, సిబ్బంది, పోలీసులు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) చట్టాల్లో కొన్ని సవరణల బిల్లుకు, హైకోర్టు సూచించిన మరికొన్ని అంశాల్లోనూ చట్టాలు చేయాల్సి ఉన్నందున అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారు. త్వరలో జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు జరుగున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందుగానే చట్టాలను సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారం వరకు ఉంది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలకు ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించింది. నవంబర్, డిసెంబర్‌లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.