దిల్లీ : హాస్యనటుడు కపిల్‌శర్మ నిర్వహించే టీవీ షో ‘ది కపిల్ శర్మ షో’ నుంచి మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూను తప్పించారు. పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌పై ఆయన చేసిన సానుభూతి వ్యాఖ్యలు ఈ చర్యలకు కారణమని తెలుస్తోంది. ఆయన స్థానంలో అర్చన పురాణ్ సింగ్‌ను షోలోకి తీసుకొన్నారు. సిద్ధూ వ్యాఖ్యల నేపథ్యంలో టీవీషో కూడా అనవసర వివాదంలో చిక్కుకుంటుందనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.
పుల్వామా దాడిపై నవజ్యోత్‌సింగ్ సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ.. జమ్ము, కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, అదొక పిరికి పందల చర్యగా అభివర్ణించారు. హింస ఎక్కడ చెలరేగినా వ్యతిరేకించాలని, దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇదే సందర్భంలో కొంతమంది చేసిన తప్పునకు దేశం మొత్తాన్ని నిందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో సిద్ధూపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అందులో కొందరు కపిల్ శర్మ షో నుంచి సిద్ధూను తొలగించాలనే డిమాండ్‌ను లేవనెత్తారు. దీంతో షో యాజమాన్యం తాజా నిర్ణయం తీసుకొన్నట్లు భావిస్తున్నారు.