Sharad Pawar : రాష్ట్రపతి రేసులో శరద్ పవార్..! ప్రశాంత్ కిశోర్ తో భేటీ తర్వాత సరికొత్త ఊహాగానాలు
ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ నిర్వహించిన భేటీ జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్..
Sharad Pawar-Prashant Kishor : ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ నిర్వహించిన భేటీ జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సమావేశంతో శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు ఒక్కసారిగా వినపడుతున్నాయి. వీరిద్దిరి భేటీలో ఇదే విషయం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రశాంత్ కిశోర్ శరద్ పవార్‌కు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షాలన్నింటికీ ఆమోదయోగ్యమైన నాయకుడు పవార్ ఒక్కరే కనిపిస్తుండటం వీటికి బలం చేకూరుతోంది.
అయితే, దీనిపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వర్గాలు ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. ఇలా ఉంటే, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే భారతీయ జనతా పార్టీ బలమే అధికంగా ఉండడం వల్ల ఆ పార్టీ అభ్యర్థే గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీంతో అసలు.. పవార్ ఈ పదవికి పోటీ చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పైగా, నిత్యం ప్రజల మధ్య ఉండడానికి ఇష్టపడే శరద్ పవార్ దీనిపై ఎలా ముందుకెళ్తారనేది చూడాలి.
కాగా, ఇటీవల జరిగిన బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు, ఇంతకుముందు జరిగిన పలు సార్వత్రిక ఎన్నికల్లో అనేక పార్టీలను విజయపంథాన నడిపించిన ప్రశాంత్ కిషోర్ కు జాతీయ రాజకీయాల్లో మంచిపట్టున్న సంగతి తెలిసిందే. అంతేకాక, 2024 లో జరిగే దేశ సార్వత్రిక ఎన్నికల్లో తన ‘మిషన్-2024’ కోసం ఆయన ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారనడానికి కూడా శరద్ పవార్ తో భేటీ నిదర్శనమని భావిస్తున్నారు. పవార్, కిషోర్ మధ్య సుమారు 4 గంటలపాటు జరిగిన చర్చల్లో ఇదే ప్రధాన అజెండాగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో ప్రధాని మోదీపై ఉమ్మడిగా విపక్ష అభ్యర్థిని ఎవరిని పెట్టాలన్న అంశం గురించి కూడా వీరు చర్చించినట్టు సమాచారం.
అయితే తాను ప్రతి రాజకీయ నేతనూ కలుస్తానని…వారి అభిప్రాయాలు తెలుసుకుంటానని, ఇందులో తప్పు లేదని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు.
Read also : Botsa : టీడీపీకి నీచమైన ఆలోచనలు తప్ప..సూచనలు ఇచ్చే అలవాటు లేదు, అందు కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన : బొత్స