తమ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అత్యవసరంగా తమకు 20 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు కావాలని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాస్తూ.. సీరం కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ని సాధ్యమైనంత త్వరగా పంపేందుకు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఇప్పటికే మా ప్రభుత్వం భారత్ బయో టెక్ సంస్థ వ్యాక్సిన్..కోవాగ్జిన్ కోసం కూడా ఇండియా నుంచి పొందజూస్తోందన్నారు. ఇందుకోసం తమ దేశం నుంచి ఓ ప్రతినిధి బృందం ఇదివరకే ఇండియాకి బయల్దేరిందన్నారు. కరోనా వైరస్ పై పోరులో భాగంగా ఆయా దేశాలు ఈ విధమైన వ్యాక్సిన్ల కోసం పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆయన గుర్తు చేశారు. ఏమైనా అర్జెంట్ గా 20 లక్షల కోవిషీల్డ్ డోసులను పంపిన పక్షంలో మీకు కృతజ్ఞులమై ఉంటామని జైర్ బొల్సోనారో మరీ మరీ కోరారు. బ్రెజిల్ లో ఇప్పటికే కోవిడ్ 19 బారిన పడి మరణించినవారి సంఖ్య 2 లక్షలకు పెరిగింది. యాక్టివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
మరికొన్ని ఇతర దేశాల నుంచి కూడా బ్రెజిల్… తమకు అత్యవసరంగా వ్యాక్సిన్లు కావాలని కోరుతోంది.