AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulivendula Politics: చంద్రబాబుకు త్వరలో సతీష్‌రెడ్డి షాక్

టీడీపీ నేత సతీష్ రెడ్డి పార్టీ వీడే యోచనలో ఉన్నారా?... పులివెందులలో టిడిపికి గట్టి షాక్ ఇచ్చేందుకు వైసీపీ వ్యూహం రచించిందా?... ఎన్నికలు పూర్తయి తొమ్మిది నెలలు గడుస్తున్నా పార్టీ కార్యక్రమాలకు సతీష్ రెడ్డి ఎందుకు హాజరు కావడం లేదు?... సతీష్ మౌనం వెనుక ఆంతర్యమేమిటి?...

Pulivendula Politics: చంద్రబాబుకు త్వరలో సతీష్‌రెడ్డి షాక్
Rajesh Sharma
|

Updated on: Feb 25, 2020 | 7:33 PM

Share

Pulivendula Satish Reddy to give shock to Chandrababu soon: టీడీపీ నేత సతీష్ రెడ్డి పార్టీ వీడే యోచనలో ఉన్నారా?… పులివెందులలో టిడిపికి గట్టి షాక్ ఇచ్చేందుకు వైసీపీ వ్యూహం రచించిందా?… ఎన్నికలు పూర్తయి తొమ్మిది నెలలు గడుస్తున్నా పార్టీ కార్యక్రమాలకు సతీష్ రెడ్డి ఎందుకు హాజరు కావడం లేదు?… సతీష్ మౌనం వెనుక ఆంతర్యమేమిటి?…

ప్రస్తుతం కడప జిల్లా పులివెందుల టీడీపీ కేడర్‌లో ఈ అంశాలపై జోరుగా చర్చ సాగుతోందట. గత ఎన్నికలలో పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థిగా వైయస్ జగన్ తో పోటీ చేసి ఓటమిపాలైన అనంతరం సతీష్ రెడ్డి సైలెంట్ కావడం వెనుక మర్మమేమిటన్న విషయం తెలుగు తమ్ముళ్లకు అంతు చిక్కడం లేదట. మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల్లో ఓటమి పాలైన అక్కడి నాయకులు మళ్లీ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒక్క పులివెందులలో మాత్రం సతీష్ రెడ్డి పూర్తిగా సైలెంట్ కావడం వెనుక వైసీపీ నేతలు రాయబారాలేమైన నడిపారా అన్న సందేహాలు పార్టీ క్యాడర్లో ఉన్నాయట.

1999 నుంచి 2019 వరకు జరిగిన అన్ని సాధారణ ఎన్నికల్లో పులివెందుల నుంచి టిడిపి అభ్యర్థిగా సతీష్ రెడ్డి పోటీచేశారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పైన 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ పైన పోటీ చేసిన సతీష్ రెడ్డి పులివెందులలో పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వచ్చారు.

పులివెందులలో వైయస్ కుటుంబంతో రాజకీయంగా తలపడుతూ వచ్చినా సతీష్ రెడ్డి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాలలో పోలింగ్ రోజున ఏజెంట్లను కూడా నిలపలేని పరిస్థితి నుంచి ప్రతి గ్రామంలో పార్టీకి క్యాడర్ తయారు చేయడం ద్వారా టీడీపీ అధిష్టానం దృష్టిలో పడ్డారు.

2014లో ఓటమిపాలైన సతీష్ రెడ్డిని ప్రోత్సహించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు శాసనసభ్యుల కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపిక చేసి అనంతరం మండలి డిప్యూటీ చైర్మన్ హోదాను కట్టబెట్టారు. కృష్ణా జలాలను పులివెందులకు తీసుకొచ్చే వరకూ గెడ్డం గీయనని ప్రతిజ్ఞ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. గండికోట రిజర్వాయర్ నుంచి పులివెందుల నియోజకవర్గం లోని పైడిపాలెం రిజర్వాయర్ కు కృష్ణా జలాలు వచ్చాకే గెడ్డం గీయించుకున్నారు.

పులివెందులలో పార్టీ బలోపేతం కోసం తనకు మరోసారి ఎమ్మెల్సీ పదవి కట్టబెడతారని ఆశించారు. అయితే టీడీపీ అధిష్టానం సతీష్ రెడ్డికి మొండి చేయ్యి చూపింది. అయినప్పటికీ పులివెందులలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో కూడా టిడిపి అధిష్ఠానం సతీష్ రెడ్డి పైనే మరోసారి నమ్మకం ఉంచి పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. కానీ ఆ ఎన్నికల్లో తాను ఓటమి పాలు కావడమే కాక రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో సతీష్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు.

ఇటీవల చంద్రబాబు కడప పర్యటనకు వస్తే.పార్టీ సమావేశంలో మాత్రమే కనిపించిన సతీష్ రెడ్డి అనంతరం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టారు. తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పూర్తిగా మొహం చాటేశారు. దీంతో సతీష్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. సతీష్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై వైసీపీ నేతలు భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం జరుగుతున్న విషయం సతీష్ రెడ్డి దృష్టికి వెళ్ళినా స్పందించకపోవడంతో పార్టీ క్యాడర్ మరింత సందిగ్ధంలో పడిందట.

నియోజకవర్గ పరిధిలోని ద్వితీయ శ్రేణి నేతలు కూడా సతీష్ రెడ్డి టిడిపిలో కొనసాగే విషయంలో సందేహాలు వెలిబుచ్చుతున్నారట. సతీష్ రెడ్డి పార్టీని వీడితే పులివెందులలో పార్టీ ఉనికిని కాపాడుకోవడం ఎలా అన్న ఆందోళన క్యాడర్ లో కనిపిస్తోందట. సతీష్ రెడ్డి మౌనం వీడేంతవరకు ఈ అంశంలో స్పష్టత వచ్చే అవకాశాలు లేవని పార్టీ క్యాడర్ నిర్ధారణకు వచ్చిందట. ఒకవేళ సతీష్ రెడ్డి పార్టీని వీడితే పులివెందుల పగ్గాలు ఎమ్మెల్సీ బీటెక్ రవికి కట్టబెడతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోందట.

Read this: Chandrababu fires on Jagan జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం