GDP growth : భారత్ వేగంగా కోలుకుంటోంది.. ఆర్ధిక వ్యవస్థ అంచనాలకు మించి మెరుగవుతోందన్న ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ

|

Dec 15, 2020 | 4:59 PM

దేశంలో కరోనా వ్యాప్తి నెమ్మదిగా అదుపులోకి వస్తోంది. కరోనా రక్కసి మిగిల్చిన ఆర్దిక గాయాల నుంచి భారత్ వేగంగా కోలుకుంటోంది. ప్రపంచంలో కోవిడ్ దెబ్బ నుంచి కోలుకుంటున్న దేశాల్లో భారత్ ముందు వరసలో..

GDP growth : భారత్ వేగంగా కోలుకుంటోంది.. ఆర్ధిక వ్యవస్థ అంచనాలకు మించి మెరుగవుతోందన్న ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ
Follow us on

S&P Global Ratings : దేశంలో కరోనా వ్యాప్తి నెమ్మదిగా అదుపులోకి వస్తోంది. కరోనా రక్కసి మిగిల్చిన ఆర్దిక గాయాల నుంచి భారత్ వేగంగా కోలుకుంటోంది. ప్రపంచంలో కోవిడ్ దెబ్బ నుంచి కోలుకుంటున్న దేశాల్లో భారత్ ముందు వరసలో ఉందని అర్ధిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును గతంలో అంచనా వేసిన 9 శాతం నుంచి 7.7 శాతం ప్రతికూలానికి సవరిస్తున్నట్టు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది.

కోవిడ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తొందరగా కోలుకుంటున్న తరుణంలో ఈ అంచనాలను సవరిస్తున్నట్టు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ తెలిపింది. దేశ అర్ధిక వృద్ధిరేటు అంచనాలను ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ సవరించింది. గతంలో 9 శాతం క్షీణిస్తుందని పేర్కొన్న అంచనాలను తిరిగి ఈ రోజు మార్చింది. తాజాగా విడుదల చేసిన నివేదికలో -7.7 శాతంగా ఉంటుందని పేర్కొంది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో వృద్ధిరేటు 10 శాతంకు పెరుగుతుందని అంచనా వేసింది.

కోవిడ్-19 వైరస్‌తో జీవించడం భారత్ నేర్చుకుందని, వైరస్ విస్తరణ ఉన్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గిపోతోందని తన నివేదికలో పేర్కొంది. ఇటీవల పండుగల సీజన్ సమయంలోనూ కరోనా ప్రభావం అధికంగా కనిపించలేదని అందుకే తమ అంచనాలను సవరించక తప్పలేదని ఎస్ అండ్ పీ తెలిపింది.

ఇక తయారీ రంగంలో.. ఆసియా పసిఫిక్ దేశాల్లో వేగంగా పుంజుకుంటున్న దేశంగా భారత్ నిలవడంతో పాటు సెప్టెంబర్ త్రైమాసికంగా ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా భారత్ రికవరీ అయ్యింది.

ఉత్పత్తి రంగం కూడా ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటోందని, ఆసియా-పసిఫిక్ అంతటా పలు ఆర్థికవ్యవస్థల్లో ఉన్నట్టుగా ఉత్పత్తి రంగంలో ఈ రికవరీ ఉందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా-పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ షాన్ రోచె చెప్పారు.