AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఒక్క క్లిక్ జీవితకాల కష్టార్జితం ఖతం.. బ్యాంకు ఖాతాలో సొమ్ము క్షణాల్లో మాయం!

"మీ పేరుతో వచ్చిన పార్శిల్‌ను డెలివరీ చేయలేకపోయాం. చిరునామా తప్పుగా ఉంది. రూ.22 చెల్లించి వివరాలు ధృవీకరిస్తే వెంటనే డెలివరీని రీ షెడ్యూల్ చేస్తాం" అని ఇండియా పోస్ట్ పేరుతో వచ్చిన ఒక ఎస్‌ఎంఎస్. అందులో ఉన్న లింక్ కూడా అధికారిక వెబ్‌సైట్‌లాగే కనిపించడంతో చాలామంది ఎలాంటి అనుమానం లేకుండా దానిపై క్లిక్ చేస్తున్నారు. కానీ ఆ ఒక్క క్లిక్ వారి బ్యాంకు ఖాతాలోని జీవితకాల సేవింగ్స్‌ను క్షణాల్లో మాయం చేసే ఉచ్చుగా మారుతోంది.

ఆ ఒక్క క్లిక్ జీవితకాల కష్టార్జితం ఖతం.. బ్యాంకు ఖాతాలో సొమ్ము క్షణాల్లో మాయం!
Parcel Fee Fraud
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jul 24, 2026 | 12:34 PM

Share

“మీ పేరుతో వచ్చిన పార్శిల్‌ను డెలివరీ చేయలేకపోయాం. చిరునామా తప్పుగా ఉంది. రూ.22 చెల్లించి వివరాలు ధృవీకరిస్తే వెంటనే డెలివరీని రీ షెడ్యూల్ చేస్తాం” అని ఇండియా పోస్ట్ పేరుతో వచ్చిన ఒక ఎస్‌ఎంఎస్. అందులో ఉన్న లింక్ కూడా అధికారిక వెబ్‌సైట్‌లాగే కనిపించడంతో చాలామంది ఎలాంటి అనుమానం లేకుండా దానిపై క్లిక్ చేస్తున్నారు. కానీ ఆ ఒక్క క్లిక్ వారి బ్యాంకు ఖాతాలోని జీవితకాల సేవింగ్స్‌ను క్షణాల్లో మాయం చేసే ఉచ్చుగా మారుతోంది. ఇటీవలి కాలంలో పార్శిల్ డెలివరీ పేరుతో జరుగుతున్న ఫిషింగ్ మోసాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఇండియా పోస్ట్ పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ వెబ్‌సైట్లు రూపొందిస్తున్నారు. చిరునామా తప్పుగా ఉందని, చిన్న మొత్తంలో డెలివరీ ఛార్జీ చెల్లించాలని నమ్మించి బాధితులను లింక్‌లోకి తీసుకెళ్తున్నారు. అక్కడ చెల్లింపు చేయగానే లేదా వ్యక్తిగత వివరాలు నమోదు చేయగానే మొబైల్‌లోని కీలక సమాచారం, బ్యాంకింగ్ వివరాలు వారి చేతికి చేరుతున్నాయి. అనంతరం బ్యాంకు ఖాతాల్లోని డబ్బును దోచేస్తున్నారు.

ఇలాంటి మోసాలకు హైదరాబాద్‌లో ఇప్పటికే పలువురు బలయ్యారు. వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి ఏకంగా రూ.23.26 లక్షలు కోల్పోగా, బంజారాహిల్స్‌కు చెందిన మరో వ్యక్తి రూ.2.49 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ ఘటనలు సైబర్ మోసాల తీవ్రతను మరోసారి బయటపెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)తో పాటు సైబర్ భద్రతా సంస్థలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఇండియా పోస్ట్ ఎప్పుడూ వాట్సాప్, ఎస్‌ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు లేదా ఓటీపీని అడగదని స్పష్టం చేస్తున్నాయి. అలాంటి సందేశాలు వస్తే వెంటనే అనుమానించి అధికారిక పోస్టాఫీస్‌ను లేదా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే వివరాలు ధృవీకరించుకోవాలని సూచిస్తున్నాయి.

ఇలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి?

మొబైల్‌కు వచ్చిన అపరిచిత లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకండి. తెలియని వ్యక్తులతో ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. పార్శిల్ డెలివరీ సమాచారం కోసం ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లోనే వివరాలు పరిశీలించండి. చిన్న మొత్తం మాత్రమే కదా అని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి చెల్లింపును ఒకసారి ధృవీకరించండి. సైబర్ నేరాల్లో సమయం అత్యంత కీలకం. డబ్బు కట్ అయిన వెంటనే స్పందిస్తే రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిపుణుల అంచనా ప్రకారం గంటలోపు ఫిర్యాదు చేస్తే 80 నుంచి 90 శాతం వరకు నిధులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అందుకోసం ముందుగా 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ కంప్లైంట్ నమోదు చేయాలి.

ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన మనీ రిస్టోరేషన్ మాడ్యూల్(MRM) ద్వారా ఫ్రీజ్ అయిన నిధులను తిరిగి పొందే ప్రక్రియ మరింత సులభమైంది. ముందుగా 1930 లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. అనంతరం MRM పోర్టల్‌లో సిటిజన్ లాగిన్ ద్వారా ప్రవేశించాలి. ఫిర్యాదు సమయంలో నమోదైన మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. ఎన్‌సీఆర్‌పీ నుంచి వచ్చిన 14 అంకెల కంప్లైంట్ నంబర్‌ను నమోదు చేయాలి. ఓటీపీ ధృవీకరణ తర్వాత ఫిర్యాదు, లావాదేవీల వివరాలు కనిపిస్తాయి. అవసరమైన పాన్, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించి రిఫండ్ అభ్యర్థన పూర్తి చేయాలి. అవసరమైతే రిఫండ్‌ను మరో బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశమూ ఉంటుంది. దరఖాస్తు స్థితిని జనరేట్ అయిన రిఫరెన్స్ ఐడీతో ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us