Egg Prices: రికార్డు స్థాయిలో మేతల ధరలు.. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పౌల్ట్రీ పరిశ్రమ..
Egg Prices: ఒకవైపు అన్ని ముడిపదార్ధాల రేట్లు పెరుగుతుండటంతో కోళ్ల దాణా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరో పక్క వీటికి విరుద్ధంగా గుడ్ల ధరలు మాత్రం నేల చూపులు చూస్తున్నాయి.
Egg Prices: ఒకవైపు అన్ని ముడిపదార్ధాల రేట్లు పెరుగుతుండటంతో కోళ్ల దాణా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరో పక్క వీటికి విరుద్ధంగా గుడ్ల ధరలు మాత్రం నేల చూపులు చూస్తున్నాయి. ఎండ వేడిని తట్టుకోలేక కోళ్లు చనిపోవటం కూడా పౌల్ట్రీ పరిశ్రమను(Poultry Industry) ఆందోనలోకి నెట్టేస్తోంది. యజమానులు నష్టాల(Losses) ఊబిలో కూరుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు గత పది సంవత్సరాల కాలంలో ఎన్నడూ చూడలేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇదే పరిస్థితిలు కొనసాగితే ఆత్మహత్యలు తప్ప తమకు మరో దారి లేదని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేయటం ప్రకంపనలు కలిగిస్తోంది.
ఒక్కసారిగా పెరిగిన దాణా రేట్లతో సతమతమవుతున్న పౌల్ట్రీ రైతుకు గిట్టుబాటుకాని గుడ్డు ధరలు మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 500కు పైగా ఫారాలు ఉండగా.. వీటిలో 25 లక్షల కోళ్లను రైతులు పెంచుతున్నారు. దాణా రేట్లు అనూహ్యంగా పెరగడం.. గుడ్ల ధర మూడు రూపాయలకు చేరుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోళ్ల దాణా టన్ను రూ.18 వేల నుంచి రూ.30 వేలకు చేరుకుంది. ఇదే సమయంలో కోళ్ల మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఉష్టోగ్రతలు 42 డిగ్రీలకు మించి ఉండటంతో ఎండ వేడిని తట్టుకోలేక కోళ్లు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇవి రైతుల నష్టాలను మరింత పెంచుతున్నాయి.
ఈ కష్టాలు చాలవన్నట్లు పెరిగిన విద్యుత్ ఛార్జీలు, కూలీల వేతనాలు, ఇతర ఖర్చులతో కలుపుకుని ఒక గుడ్డు ఉత్పత్తికి సుమారుగా రూ.4 ల వరకు ఖర్చవుతోంది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర రూ.4.23 ఉన్నప్పటికీ రైతులకు మాత్రం రూ.2.95 లు మాత్రమే చెల్లిస్తుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు గుడ్డుకు ధర లేకపోవడం ఎగుమతులు అంతంత మాత్రంగా ఉండడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుత పరిస్థితిని బట్టి కొత్త బ్యాచ్‌లను వేసేందుకు కూడా రైతులు వెనకడుగు వేస్తున్నారు.
ఇవీ చదవండి..
Cows Online: ట్రెండ్ మారింది.. ఆన్‌లైన్‌లో ఆవులు, గేదెల అమ్మకాలు షురూ..