AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఋణ ముక్తేశ్వర మహాదేవ్ మహిమ.. ఈ శివాలయం దర్శనంతో అన్ని అప్పుల నుంచి విముక్తి లభిస్తుందట!

Rin Mukteshwar Mahadev Temple: శ్రావణ మాసంలో భక్తులతో కిటకిటలాడుతున్న మధ్యప్రదేశ్‌లోని వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఋణ ముక్తేశ్వర మహాదేవ్ ఆలయం విశేషాలు తెలుసుకోండి. ఈ ఆలయాన్ని దర్శిస్తే ఆర్థిక అప్పులతో పాటు పితృ, దేవ, గురు రుణాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. కుక్క విశ్వాసంతో ముడిపడిన ఆసక్తికరమైన గాథ, ఆలయ చరిత్ర, ప్రత్యేకతల గురించి పూర్తి వివరాలు.

ఋణ ముక్తేశ్వర మహాదేవ్ మహిమ.. ఈ శివాలయం దర్శనంతో అన్ని అప్పుల నుంచి విముక్తి లభిస్తుందట!
Rin Mukteshwar Mahadev Temple
Rajashekher G
|

Updated on: Aug 05, 2026 | 8:07 PM

Share

ఉత్తర భారతదేశ ప్రాంతంలో పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. “హర హర మహాదేవ్” నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతుండగా, మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాచీన శివాలయం ప్రత్యేకంగా భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. దిండోరి జిల్లాలో ఉన్న ఋణ ముక్తేశ్వర మహాదేవ్ ఆలయం (Rin Mukteshwar Mahadev Temple)కు దర్శనం ఇచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే ఆర్థిక అప్పులతో పాటు పితృ రుణం, దేవ రుణం, గురు రుణం వంటి జీవితంలోని వివిధ రుణాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని స్థానికుల విశ్వాసం.

వెయ్యేళ్ల చరిత్ర కలిగిన అరుదైన శివాలయం

మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లా కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుకర్రమఠ్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఇది కల్చూరి రాజవంశం పాలనలో 8వ నుంచి 10వ శతాబ్దం మధ్య నిర్మించబడిన దాదాపు వెయ్యేళ్ల నాటి ఆలయం. ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. సాధారణంగా చాలా శివాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ ఋణ ముక్తేశ్వర మహాదేవ్ ఆలయం పడమర ముఖంగా నిర్మించబడటం ప్రత్యేక ఆకర్షణ. గర్భగుడిలో సుమారు మూడు అడుగుల ఎత్తైన శివలింగం ప్రతిష్ఠించబడి ఉంది. శ్రావణ మాసంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని జలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత పురావస్తు శాఖ (ASI) దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించింది.

కుక్క విశ్వాసం.. ఆలయ ఆవిర్భావానికి కారణమైన హృదయ విదారక గాథ

ఈ ఆలయం వెనుక ప్రచారంలో ఉన్న కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు కాంచనిపూర్ (ప్రస్తుత కుకర్రమఠ్) గ్రామంలో లఖా బంజారా అనే వ్యాపారి నివసించేవాడని చెబుతారు. ఆర్థిక ఇబ్బందులతో అతను తనకు అత్యంత ప్రియమైన, విశ్వాసపాత్రమైన కుక్కను ఓ వడ్డీ వ్యాపారికి తాకట్టు పెట్టాడు.

ఇవి కూడా చదవండి

కొద్ది రోజుల తర్వాత ఆ వడ్డీ వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు దోచుకున్న సంపదను గ్రామ సమీపంలోని చెరువులో దాచిపెట్టారు. ఇదంతా గమనించిన కుక్క మరుసటి రోజు వడ్డీ వ్యాపారిని చెరువు వద్దకు తీసుకెళ్లి దాచిన ధనాన్ని చూపించింది. కుక్క విశ్వాసానికి, తెలివికి ముగ్ధుడైన వడ్డీ వ్యాపారి లఖా బంజారా అప్పును పూర్తిగా మాఫీ చేసి, దానికి సంబంధించిన విడుదల పత్రాన్ని కుక్క మెడకు కట్టి యజమాని వద్దకు పంపించాడు.

అయితే మార్గమధ్యంలో కుక్కను చూసిన లఖా బంజారా, అది వడ్డీ వ్యాపారి ఇంటి నుంచి పారిపోయిందని అపార్థం చేసుకున్నాడు. ఆవేశంలో కర్రతో కొట్టడంతో కుక్క అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం దాని మెడలో ఉన్న ఉత్తరాన్ని చదివిన బంజారా తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యాడు. తన విశ్వాసపాత్రమైన కుక్క జ్ఞాపకార్థం అదే ప్రదేశంలో ఓ స్మారకాన్ని నిర్మించాడని, స్థానిక భాషలో కుక్కను “కుకుర్” అని పిలవడం వల్ల ఆ ప్రాంతానికి “కుకర్రమఠ్” అనే పేరు వచ్చిందని స్థానిక కథనం చెబుతోంది.

ఆలయ శిఖరానికి సంబంధించిన పాండవుల గాథ

ఈ ఆలయ శిఖరం అసంపూర్తిగా ఉండటానికి కూడా మరో పురాణగాథ ప్రచారంలో ఉంది. ద్వాపర యుగంలో వనవాస సమయంలో పాండవులు ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. సూర్యోదయానికి ముందే గోపురంపై కలశాన్ని ప్రతిష్ఠించాలని భావించినప్పటికీ, తెల్లవారిపోవడంతో ఆ పని పూర్తికాలేదని, అందుకే ఆలయ శిఖరం నేటికీ అసంపూర్తిగానే ఉందని స్థానికులు విశ్వసిస్తారు. ఇప్పటికీ ఆలయ పైభాగంలో చదునైన వేదిక కనిపించడం ఈ కథనానికి నిదర్శనంగా చెబుతుంటారు.

శ్రావణంలో ప్రత్యేక రద్దీ.. కట్టుదిట్టమైన భద్రత

శ్రావణ మాసంలో ఋణ ముక్తేశ్వర మహాదేవ్ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్థానిక పోలీసు యంత్రాంగం, పురావస్తు శాఖ అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేలా క్యూలైన్లు, భద్రతా చర్యలు, రద్దీ నియంత్రణ ఏర్పాట్లు చేపట్టారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న రుణ విముక్తి, ఆలయ ఆవిర్భావం, పాండవుల నిర్మాణం వంటి అంశాలు స్థానిక విశ్వాసాలు, జానపద గాథలు, ప్రచారంలో ఉన్న కథనాల ఆధారంగా అందించబడ్డాయి. వీటికి చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారాలు నిర్ధారించబడలేదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us