రాయపాటి సాంబశివరావు. ఏపీ పాలిటిక్స్‌లో పరిచయం అవసరం లేని రాజకీయ నాయకుడు. చాలా కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి.. 2014 రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరిన నేపథ్యంలో 2014-2019 మధ్య కాలంలో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్న రాయపాటి ఇళ్ళపైనా, ఆయన డైరెక్టర్‌గా వున్న ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ ఆఫీసులపై సీబీఐ దాడులు చేస్తోంది. పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాయపాటి.. ఆయన స్థాపించిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ.
ఈ నేపథ్యంలో గురువారం నాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాయపాటి.. ఆక్కడ మీడియాతో మాట్లాడుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సీబీఐ దాడుల నేపథ్యంలో రాయపాటి బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే అంశాన్ని మీడియా ప్రశ్నిస్తే.. ‘‘ ప్రస్తుతానికి పార్టీ మారే యోచన లేదు.. కానీ భవిష్యత్తులో పార్టీ మారే ఛాన్స్ వుండొచ్చు ’’ ఇదే రాయపాటి చేసిన కామెంట్. సీబీఐ వాళ్ళు వచ్చినపుడు తాను కంపెనీలో లేనని, నిజానికి ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ వ్యవహారాలను ప్రస్తుతమున్న సీఈఓ చెరుకూరి శ్రీధర్ చూసుకుంటున్నారని చెప్పారు రాయపాటి.
సీబీఐ వాళ్ళు తనిఖీలు చేసి, ఏమీ లేదని చెప్పి వెళ్ళిపోయారని, కేసులతో తనకెలాంటి సంబంధం లేదని రాయపాటి చెప్పుకొచ్చారు. అయితే, యూనియన్ బ్యాంకు కన్సార్షియం నుంచి 2013లో రుణాలు తీసుకున్నప్పుడు మాత్రం రాయపాటి కంపెనీ ఫౌండర్ ప్రమోటర్ ఛైర్మెన్‌గానే వున్నారని సమాచారం. ఈ అంశాన్ని అడగబోతే రాయపాటి దాటేసి వెళ్ళిపోయారని సమాచారం.