ఇజ్రాయెల్ సాఫ్ట్ వేర్ ‘ పెగాసస్ ‘ ద్వారా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాక్ కావడం దేశంలో సంచలనం సృష్టించింది. అనేకమంది లాయర్లు, జర్నలిస్టులు,జడ్జీలు, హక్కుల కార్యకర్తలు, ఇతర రాజకీయ నేతల ఫోన్లు కూడా హ్యాక్ కావడంతో కాంగ్రెస్ పార్టీ.. ఇందుకు మోదీ ప్రభుత్వ నిర్వాకమే కారణమని ఆరోపిస్తోంది. స్నూప్ గేట్ బాధితులకు వచ్చినట్టుగానే ప్రియాంక గాంధీకి కూడా మిస్డ్ కాల్ తో బాటు డేంజరస్ మెసేజ్ వచ్చిందని ఈ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా పేర్కొన్నారు. కేంద్రంపై విమర్శలు చేస్తున్నవారిని స్పై వేర్ పేరిట మోదీ ప్రభుత్వమే పలువురి ఫోన్లను హ్యాక్ చేయించిందని ఆయన దుయ్యబట్టారు.పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తన ఫోన్ హ్యాక్ కి గురైందని తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇజ్రాయెల్ స్పై వేర్ ‘ పెగాసస్ ‘ ద్వారా ఇండియాలోని సుమారు 1400 మంది ఫోన్లు హ్యాకింగ్ కి గురయ్యాయని వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్ బుక్ వెల్లడించింది. అసలు 2019 మే నుంచే మొదలైన ఈ ఇల్లీగల్ స్పై వేర్ గురించి ప్రభుత్వానికి తెలుసా అని సుర్జేవాలా ప్రశ్నించారు. పెగాసస్ ద్వారా 121 మంది భారతీయ యూజర్ల ఫోన్లను టార్గెట్ చేశారని వాట్సాప్ గత సెప్టెంబరులోనే భారత ప్రభుత్వానికి తెలియజేసింది. అయితే ఈ సమాచారం అసంపూర్తిగా ఉందని ఐటీ మంత్రిత్వ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన బీజేపీ.. ఇజ్రాయెల్ కు చెందిన ఈ అధునాతన స్నూపింగ్ సాఫ్ట్ వేర్ తో తమకు సంబంధం లేదని పేర్కొంది. అయినా.. ఈ ఉదంతంపై తాము వాట్సాప్ నుంచి వివరణ కోరామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
అసలు ఈ స్పై వేర్ లోతుల్లోకి వెళ్లి చూస్తే.. ఇజ్రాయెల్ లోని ఎస్ ఎన్ ఓ గ్రూపు అభివృద్ది పరచిన ఈ సాఫ్ట్ వేర్ ముఖ్యంగా భారత్ లోని ప్రముఖులను టార్గెట్ చేయడానికి ఉద్దేశించినదట.. పెగాసస్ తో ఫోన్లను ‘ ప్రభావితం ‘ చేసేందుకు వాట్సాప్ ను హ్యాక్ చేయడమేమిటని ప్రశ్నిస్తూ ఫేస్ బుక్ ఈ సంస్థపై దావా వేసేందుకు రెడీ అయింది. అయితే తమ క్లయింట్ల పేర్లను వెల్లడించేందుకు ఎస్ ఎన్ ఓ సంస్థ నిరాకరించింది. ఇజ్రాయెల్ రక్షణ మంతిత్వ శాఖ నుంచి లిఖిత పూర్వక అనుమతి పొందాకే ఈ సాఫ్ట్ వేర్ ని వినియోగించాలని ‘ ఘనా నేషనల్ కమ్యూనికేషన్స్ అథారిటీ ‘ స్పష్టం చేయడం విశేషం. ఈ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకున్న ఫేస్ బుక్ కాలిఫోర్నియా కోర్టులో ఇజ్రాయెల్ సంస్థపై దావా వేయనుంది. పెగాసస్ ‘ నిఘా ‘ సాఫ్ట్ వేర్ ప్రకారం.. శిక్షణ పొందిన ఓ ఆపరేటర్.. టార్గెట్ చేసినవారి ఫోన్ ను ‘ హైజాక్ ‘ చేసి.. కెమెరాను, జీపీఎస్ట్రాకర్ను తన ‘ అదుపు ‘ లోకి తీసుకోవడం ద్వారా సంబంధిత వ్యక్తుల మెసేజులను, వారికి అందిన కాల్స్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్ఛునట. ఇక్కడ.. ఇజ్రాయెల్ రక్షణ శాఖ అనుమతితోనే ఇదంతా జరుగుతోందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంటున్నారు. ఇది పూర్తిగా అనైతికం.. చట్ట విరుధ్ధమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల ప్రయివసీకి భంగం కలిగించే అంశమని ఆయన పేర్కొన్నారు.
ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రధానంగా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడమే కాక.. జడ్జీలు, లాయర్లు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల ఫోన్ల ఆరాలపైనా నిఘా పెట్టడమేమిటన్నది ప్రశ్న.. ఈ విషయమై కేంద్రం నేరుగా ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని సంప్రదించవచ్ఛు కదా అన్న వ్యాఖ్యకు సర్కార్ నుంచి మౌనమే సమాధానంగా వస్తోంది.