టీవీ9తో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన నటుడు ప్రకాష్ రాజ్.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ స్థిరత్వం లేని నిర్ణయాలు తీసుకుంటూ ఊసరవెల్లిలా మారిపోతున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ నిర్ణయం జనసేన పార్టీ నేతలకు కూడా ఇష్టం లేదని అన్నారు. బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు గురించి, పవన్ నిర్ణయాల గురించి ప్రకాష్ రాజ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం…
‘ఆయనకు ఏమైందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఆయన తీసుకున్న నిర్ణయాలతో నిజంగా చాలా నిరాశకు గురయ్యాను. నువ్వు ఒక నాయకుడివి. మీకు జనసేన అనే పార్టీ ఒకటి ఉంది. మీరు మరో నాయకుడివైపు చూడటం ఏంటి? ఆంధ్రాలో మీ ఓట్ షేర్ ఏంటి? బీజేపీ ఓట్ షేర్ ఏంటి? మీరెందుకు వారి(బీజేపీ) భుజం ఎక్కారు? 2014 ఎన్నికల సమయంలో మీరే స్వయంగా వెళ్లి ఇంద్రుడు, చంద్రుడు అంటూ వారి(మోదీ)కి సపోర్ట్ చేశారు. 2019 ఎన్నికల సమయానికి వారు ద్రోహం చేశారంటూ మీరే రివర్స్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు మీకు ఆయన(మోదీ) నాయకుడిగా కనిపిస్తున్నారు. ఇలా ప్రతిసారి ఊసరవెల్లిలా మారుతున్నారు. మరొకరి భుజం మీద కూర్చోవడంతో కంటే జనసేన పార్టీని నేరుగా బీజేపీలోనే కలిపేస్తే సరిపోతుంది కదా? పవన్‌కు అసలు మనస్సాక్షి అనేది లేదా? ’ అంటూ పవన్ తీరును ప్రకాష్ రాజ్ తూర్పారబట్టారు. అంతేకాదు.. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపైనా ప్రకాష్ రాజ్ తీవ్రంగా మండిపడ్డారు. బెంగళూరు నుంచి వచ్చిన తేజస్వి సూర్య అసలేం మాట్లాడారని ప్రశ్నించారు. కేసీఆర్ లా పనులు చేయాలంటే బీజేపీ నాయకులు వెయ్యి జన్మలెత్తాలంటూ ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. దేశంలో జాతీయ పార్టీలన్నీ విఫలం అయ్యాయని ముఖాముఖి కార్యక్రమంలో ఆయన కుండబద్దలు కొట్టారు.