Budget 2021-22: ఏపీలో బడ్జెట్ చిచ్చు.. కేంద్రంపై కస్సుమంటూనే వైసీపీపై టీడీపీ, కాంగ్రెస్ విమర్శల పర్వం

కేంద్ర బడ్జెట్ ఏపీలో రాజకీయ రచ్చను రాజేసింది. ప్రధాన పార్టీలన్నీ కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరువగా… ఏపీకి ఏమీ సాధించలేకపోయారంటూ విపక్షాలు వైసీపీపై విమర్శల..

Budget 2021-22: ఏపీలో బడ్జెట్ చిచ్చు.. కేంద్రంపై కస్సుమంటూనే వైసీపీపై టీడీపీ, కాంగ్రెస్ విమర్శల పర్వం

Edited By:

Updated on: Feb 01, 2021 | 4:31 PM

Political Uproar on Union Budget in Andhra Pradesh: కేంద్ర బడ్జెట్ ఏపీలో రాజకీయ రచ్చను రాజేసింది. ప్రధాన పార్టీలన్నీ కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరువగా… ఏపీకి ఏమీ సాధించలేకపోయారంటూ విపక్షాలు వైసీపీపై విమర్శల యుద్దానికి తెరలేపాయి. ప్రత్యేక హోదా సహా ఎలాంటి సాయాన్ని ఏపీకి సాధించలేకపోయారంటూ వైసీపీ ఎంపీలపైనా, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపైనా ఆరోపణలకు దిగాయి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు. విశాఖ జోన్ ఊసే లేదని.. గంటా 50 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో విజయవాడ, వైజాగ్‌ల పేర్ల ప్రస్తావన ఒక్కసారి మినహా ఏమీ రాలేవని ఎద్దేవా చేశాయి విపక్షాలు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏపీలో రాజకీయ పార్టీలను పూర్తి నిరాశకు గురి చేశాయి. పాలక వైసీపీ కూడా బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే పార్లమెంటు ఎదుటే కేంద్ర ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందంటూ విమర్శించింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. తాజా కేంద్ర బడ్జెట్‌ను కేవలం నాలుగు రాష్ట్రాల బడ్జెట్‌గా అభివర్ణించారు. 2021లో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళ రాష్ట్రాలకే అధిక కేటాయింపులు చేశారంటూ.. తాజా బడ్జెట్ లో ఏపీకి పూర్తిగా అన్యాయం జరిగిందని ఏపీ విపక్షాలు ముక్తకంఠంతో ఆరోపించాయి.

ఏపీకి నిధులు రాబట్టడంలో వైసీపీ ఎంపీలు విఫలమయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ‘‘ జ‌నాన్ని మోసంచేసే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి రాష్ట్రాన్ని ద‌గా చేశారు.. 25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడ‌లు వంచి మ‌రీ ప్ర‌త్యేక హోదా సాధిస్తాన‌ని ఉత్త‌ర‌ కుమార ప్ర‌గ‌ల్భాలు ప‌లికి.. తన 31 కేసుల నుంచి త‌ప్పిస్తే చాలు ప్ర‌త్యేక హోదా ఊసెత్త‌న‌ని 28 ఎంపీల్ని కేంద్రానికి తాక‌ట్టు పెట్టారు.. విభ‌జ‌న‌ చ‌ట్టం ప్ర‌కారం ఏపీకి రావాల్సిన హామీల‌కు బాబాయ్ హ‌త్య కేసుతో చెల్లు చేసింది కేంద్రం.. బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించ‌క్క‌ర్లేదు కానీసహ నిందితులైన అధికారులను త‌న‌కు కేటాయిస్తే చాల‌ని కేంద్రం వ‌ద్ద సాగిల‌ప‌డ్డారు జ‌గ‌న్‌ రెడ్డి.. అప్పులు వాడుకోవ‌డానికి అనుమ‌తిస్తే చాలు..ఏ ప్రాజెక్టులివ్వ‌క‌పోయినా ఫ‌ర్వాలేద‌ని ఒప్పందం చేసుకున్నారు.. బ‌డ్జెట్‌లో ఏపీకి ఏమీ ఇవ్వ‌ని కేంద్రాన్ని ఏమీ అన‌లేని నిస్స‌హాయ‌స్థితిలో వున్నారు జగన్ రెడ్డి.. ’’ అంటూ వ్యాఖ్యానించారు నారా లోకేశ్.
మరోవైపు పెట్రో బాదుడుపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసిన వామపక్షాలు ఏపీలో పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. పలు చోట్ల మోదీ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు వామపక్షాలకు చెందిన నేతలు, శ్రేణులు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక సంక్షోభంలో పడిపోయిందని, దాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక హోదా ఇస్తామన్న 2014 నాటి హామీకి బీజేపీ ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి ఆరోపించారు. జాతీయ బడ్జెట్ లాగా లేదని, కేవలం నాలుగు రాష్ట్రాలకు నిధులు కేటాయించేందుకు, తద్వారా ఆ రాష్ట్రాలలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఉద్దశమే బీజేపీ నేతలకు వుందని తులసీరెడ్డి వ్యాఖ్యానించారు.

ఇక అధికార వైసీపీ చెందిన ఎంపీలు విజయసాయిరెడ్డి సారథ్యంలో పార్లమెంటు భవనం ముందు మీడియాతో మాట్లాడారు. తొలిసారి కేంద్రంపై కాస్త గట్టిగానే కామెంట్లు చేశారు విజయసాయిరెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఏపీ డిమాండ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీ కేంద్ర ప్రభుత్వం ముందుంచిన వినతులను ఆర్థిక మంత్రి అస్సలు పట్టించుకోలేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. గుడ్డిలో మెల్లగా విజయవాడ-ఖరగ్ పూర్ ఈస్ట్ కోస్ట్ సరుకు రవాణా కారిడార్ ఒక్కటి మంజూరు చేశారన్నారు. విశాఖ రైల్వే జోన్ విషయంలోను స్పష్టత లేదని, జగన్ ప్రభుత్వం 8 పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంటే వాటికి కేంద్ర సాయం ఏ మాత్రం లేదని వైసీపీ ఎంపీలు చెప్పుకొచ్చారు. ఆరోగ్య శ్రీకి పోటీగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో అన్ని రోగాలను కవర్ చేసేలా రూపొందించాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

‘‘ దేశంలో నిరుద్యోగం చాలా ఎక్కువగా పెరుగుతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించినట్టుగా కనిపించడం లేదు.. పనికి ఆహార పథకం విషయంలో 150 రోజులకు పని దినాలు పెంచాలని మొదటినుంచి కోరుతున్నాం. దీని గురించి బడ్జెట్ లో ఎటువంటి ప్రస్తావన చేయలేదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆశించినట్టుగా బడ్జెట్ లేదు.. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లాగా లేదు.. కేవలం తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల కోసం రూపొందించిన బడ్జెట్ లా ఉంది.. ’’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి కేంద్ర బడ్జెట్ ఏపీలో రాజకీయ చిచ్చును రేపింది. అధికార వైసీపీ కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీపై మండిపడుతుండగా.. విపక్షాలు బీజేపీ ప్రభుత్వంతో పాటు.. వైసీపీని ఓ ఆటాడుకుంటున్నాయి. అయితే, బడ్జెట్ లోతుపాతులు తెలియకుండా వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాల నేతలు మాట్లాడుతున్నారని, బీజేపీకి దేశంలోని అన్ని రాష్ట్రాలు సమానమేనని ఏపీ బీజేపీ నేతలంటున్నారు. ఆరోగ్యానికి ఆర్థిక మంత్రి నిర్మల పెద్ద పీట వేశారని వారు వాదిస్తున్నారు.