ప్రజా గాయకుడు నిసార్ మహమ్మద్ కన్నుమూశారు. కరోనా వైరస్‌తో ఈ రోజు ఉదయం ఆయన మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాగా ప్రజల కష్టసుఖాలను, తెలంగాణ గుండె చప్పుళ్లను తన పాటలతో ఎలుగెత్తి చాటిన తెలుగు కవి, గాయకుడు నిసార్ మహమ్మద్. మొదట ఆర్టీసీలో కండక్టరుగా, డిపో కంట్రోలర్‌గా పనిచేసిన నిసార్ కొన్ని దశాబ్దాలుగా పలు పాటలతో ప్రజా ఉద్యమాలకు ఊపునిచ్చారు. తాజాగా నిసార్ కరోనా వైరస్ సృష్టించిన విలయపై పాట రాసి ఆలపించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. కాగా నిసార్ స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సుద్దాల. చిన్నప్పటి నుంచి ఆయన సమాజం కోసమే పాటుపడ్డారు. తెలంగాణ సాధన ఉద్యమంలో అనేక ధూంధాంలు నిర్వహించారు. నిసార్ మృతిని సాంస్కృతిక రంగానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటని ప్రజా సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి.