AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పంజాగుట్ట శ్మశానంలో పసికందు మృతదేహం మాయం కేసులో ట్విస్ట్‌

పంజాగుట్ట శ్మశానవాటికలో పసికందు మృతదేహం మాయం కావడం కలకలం రేపుతోంది. కుక్కలు మృతదేహాన్ని పెకిలించి తీసుకెళ్లి ఉంటాయని పోలీసులు అనుమానిస్తుండగా.. తల్లిదండ్రులు మాత్రం ఆ వాదనను ఖండిస్తున్నారు. ఘటనాస్థలంలో లభించిన అవశేషాలను DNA, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిన పోలీసులు.. మృతదేహం మాయమైన ఘటన వెనుక కుట్ర కోణం ఉందా అనే అంశంపైనా దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: పంజాగుట్ట శ్మశానంలో పసికందు మృతదేహం మాయం కేసులో ట్విస్ట్‌
Panjagutta Crematorium
Ram Naramaneni
|

Updated on: Aug 12, 2026 | 11:28 AM

Share

హైదరాబాద్‌ పంజాగుట్ట శ్మశానవాటికలో పసికందు మృతదేహం మాయం కావడం కలకలం రేపుతోంది. ఇద్దరు కవలలు జన్మించగా.. వారిలో ఒకరు పుట్టిన వెంటనే మృతి చెందడంతో తల్లిదండ్రులు శ్మశానంలో పూడ్చిపెట్టారు. మరుసటి రోజు మరో పసికందు కూడా మృతి చెందడంతో.. ఆ బాడీని కూడా పక్కనే పాతిపెట్టేందుకు కుటుంబ సభ్యులు వెళ్లారు. అయితే అప్పటికే మొదటి పసికందు మృతదేహం కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మృతదేహాన్ని కుక్కలు లాక్కెళ్లి ఉండొచ్చని.. అక్కడి పరిస్థితిని బట్టి పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ వాదనను పసికందు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. మృతదేహాన్ని కుక్కలు లాక్కెళ్లిన ఆనవాళ్లు అక్కడ కనిపించడం లేదని.. ఎవరో పద్ధతి ప్రకారం పూడ్చిన ప్రాంతాన్ని తవ్వి మృతదేహాన్ని వెలికితీసినట్లుగా పరిస్థితి ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు BNS సెక్షన్‌ 301 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బంజారాహిల్స్‌ పోలీసులు క్లూస్‌ టీంతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పసికందును పూడ్చిన ప్రాంతంలో వస్త్రం, చిన్న కాళ్ల అవశేషాలు, మాంసపు ముద్దలు గుర్తించినట్లు సమాచారం. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు DNA, ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించారు.

గుర్తించిన కాళ్ల అవశేషాలు, మాంసపు ముద్దలు నిజంగా మాయమైన పసికందు మృతదేహానికి సంబంధించినవేనా? మృతదేహాన్ని కుక్కలు బయటకు తీసి తిన్నాయా? లేక దీని వెనుక మరేదైనా కుట్ర కోణం ఉందా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన సాంకేతిక ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు.

కేసులో అనుమానితులుగా భావిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. శ్మశానవాటికలో పనిచేసే కాటికాపర్లను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పూడ్చిన సమయం నుంచి అది కనిపించకుండా పోయే వరకు అక్కడికి ఎవరెవరు వచ్చారు? ఏదైనా అనుమానాస్పద కదలికలు జరిగాయా? అనే వివరాలను సేకరిస్తున్నారు.

ప్రస్తుతం DNA, ఫోరెన్సిక్‌ నివేదికలపైనే పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు ఆధారపడి ఉన్నాయి. అవశేషాలు పసికందువేనని నిర్ధారణ అవుతుందా? మృతదేహం మాయమైన తీరుపై మరింత స్పష్టత వస్తుందా? అన్నది నివేదికలు వచ్చిన తర్వాత తేలనుంది. దీంతో పంజాగుట్ట శ్మశానంలో పసికందు మృతదేహం మాయం కేసులో అసలు ట్విస్ట్‌ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us