AP Polls: పంచాయితీ ఎన్నికల గణాంకాల కన్‌ఫ్యూజన్.. స్టేట్ ఎలెక్షన్ కమిషన్ క్లారిటీ.. తాజా లెక్కలివే!

|

Feb 22, 2021 | 4:08 PM

ఏపీలో పంచాయితీ ఎన్నికల పర్వం ముగిసింది. అయితే.. లెక్కల విషయంలోనే అధికార విపక్షాలు పరస్పరం బిన్నమైన లెక్కలు చెబుతూ జనాన్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. గణాంకాలపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. వివరాలు...

AP Polls: పంచాయితీ ఎన్నికల గణాంకాల కన్‌ఫ్యూజన్.. స్టేట్ ఎలెక్షన్ కమిషన్ క్లారిటీ.. తాజా లెక్కలివే!
Follow us on

AP Panchayithi Polls numbers and details: సుదీర్ఘ కాలం పాటు వార్తల్లో నానిన ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల పర్వం ముగిసింది. ఫైనల్‌ లెక్కలపై అధికార, విపక్షాలు పరస్పరం విభేదించుకుంటూనే వున్నాయి. ఏపీ సర్కార్‌తో అమీతుమీకి రెడీ అయి మరీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్రంలో పంతం పట్టి మరీ పంచాయితీ ఎన్నికలు పర్వాన్ని పూర్తి చేశారు. ఆదేశాలు, వాటి రద్దు.. కోర్టు వ్యాజ్యాలు, అధికారుల బదిలీలు ఇక రాజకీయ పార్టీల విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇలా ఏపీ పంచాయితీ ఎన్నికలు ఆద్యంతం రక్తి కట్టాయి. మీడియాకు పతాక శీర్షికలను ఇచ్చాయి.

ఎన్నికలైతే ముగిసాయి కానీ ఇంకా పాలక, ప్రతిపక్షాల మధ్య వీధి పోరాటాలకు తెరపడలేదు. అదేసమయంలో వైసీపీ, టీడీపీల మధ్య ఏకగ్రీవాల గణాంకాల లెక్కలకు ముగింపు రాలేదు. ఎవరికి వారు తమకు అనుకూలంగా గణాంకాలను వెల్లడించుకుంటున్నారు. తమదే పైచేయి అని చాటుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా పంచాయతీ ఎన్నికల లెక్కలను వెల్లడించింది.

ఏపీలో పంచాయతీ ఎన్నికలు-2021

ఏపీ వ్యాప్తంగా మొత్తం 13 వేల 97 సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. అందులో 2,197 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. అంటే ఏకగ్రీవం అయిన సర్పంచుల శాతం 16.77. మొత్తం లక్షా 31 వేల 23 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. అందులో 47 వేల 459 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. ఏకగ్రీవం అయిన వార్డులు 36.22 శాతంగా వుంది. ఇక మొత్తం నాలుగు విడతల్లో జరిగిన పంచాయితీ పోలింగ్ శాతం 81.78గా లెక్క తేలింది.

ఏపీలో మొత్తం జిల్లాలు-13 కాగా.. రెవిన్యూ డివిజన్లు-51, మండలాలు -655, గ్రామ పంచాయతీలు -13,330, వార్డు సభ్యులు 1,33,584గా వున్నాయి. అస్సలు నామినేషన్లు దాఖలు కానీ పంచాయతీల సంఖ్య 10. నామినేషన్లు దాఖలు కానీ వార్డుల సంఖ్య 670. మొత్తం ఏకగ్రీవాలు 2,197లుగా ఎన్నికల కమిషన్ పేర్కొంది.

ఎన్నికలు జరిగిన పంచాయతీలు 47 వేల 459 కాగా.. పోటీ పడిన అభ్యర్థులు 30 వేల 245 మంది. వార్డు సభ్యులకు పోటీ పడిన అభ్యర్థులు లక్షా 84 వేల 339 మందిగా కమిషన్ వెల్లడించింది. మొత్తం ఓటర్లు రెండు కోట్ల 77 లక్షల 17 వేల 784 మందిగా పేర్కొన్నారు. అందులో పురుషులు 1,37,55,364 మంది, మహిళలు 1,39,58,673 మంది వున్నారు. ఇతరులు 3,747. మొత్తం నాలుగు విడతల్లో పోలైన ఓట్ల సంఖ్య 2,26,67,604 కాగా.. పోలింగ్ శాతం 81.78 %గా తేలింది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల పరిశీలకులు (ఐఏఎస్) 13 మందిని, ఖర్చుల పరిశీలకులు (ఐఎఫ్ఎస్) 13 మందిని, నోడల్ అధికారులు 13 మందిని నియమించారు.

స్టేజ్ 1 టర్నింగ్ అధికారులు 5,249 మంది, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులు 13,052 మంది, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 7,854, పోలింగ్ అధికారులు (పిఓ) 1,31,443 మంది, అదనపు పోలింగ్ అధికారులు 1,91,919 మంది, జోనల్ అధికారులు 2,159 మంది, రూట్ అఫీసర్స్ 4,965 మంది, మైక్రో అబ్జర్వర్స్ 11,298 మంది, వెబ్ కాస్టింగ్ సేవకులు 5,464 మంది కలిపి మొత్తం మూడు లక్షల 73 వేల 397 మంది ఎన్నికల నిర్వహణలో విధి నిర్వహణ చేశారు. వీరి సంఖ్య నాలుగు విడతల యావరేజ్ 93,349గా పేర్కొన్నారు. మొత్తం కౌంటింగ్ సూపర్ వైజర్స్ 63,540 మంది, కౌంటింగ్ సిబ్బంది 1,71,773 మందిని వినియోగించినట్లు ఎన్నికల కమిషన్ వివరించింది.

రాష్ట్రంలో మొత్తం లక్షా 14 వేల 882 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 19 వేల 103గా గుర్తించారు. అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా 15 వేల 869గా గుర్తించి ఏర్పాట్లు చేశారు. తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 వేల 49 కేంద్రాల్లో హింసాత్మక సంఘటనలు జరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం హింసాత్మక ఉదంతాల సంఖ్యను 37 వేల 21గా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. పంచాయితీ ఎన్నికలను సజావుగా నిర్వహించిన ఉత్సాహంతో మునిసిపల్ ఎన్నికలకు సంఘం సిద్దమవుతోంది.

Also Read: పుదుచ్ఛేరి అనూహ్య పరిణామాలు.. నెక్స్ట్ జరిగేది ఇదే!