వీధినపడ్డ జీహెచ్ఎంసీ సివరేజీ ప్లాంట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది
కరోనా దెబ్బకు అన్నిరంగాలు కుదేలయ్యాయి. ఆర్థికంగా చితికిపోయిన కంపెనీలు ఇప్పడిప్పుడే గాడినపడుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్న కొన్ని కంపెనీలు రీస్టార్ట్ పేరుతో ఉద్యోగుల్లో కోతలు విధిస్తున్నాయి.
కరోనా దెబ్బకు అన్నిరంగాలు కుదేలయ్యాయి. ఆర్థికంగా చితికిపోయిన కంపెనీలు ఇప్పడిప్పుడే గాడినపడుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్న కొన్ని కంపెనీలు రీస్టార్ట్ పేరుతో ఉద్యోగుల్లో కోతలు విధిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మహానగర శివారు సివరేజీ బాధ్యతల బదిలీ ఉదంతంలో ఔట్ సోర్సింగ్ కార్మికులు బలి పశువులుగా మారారు. ఆరు నెలల క్రితం విధుల్లోకి తీసుకున్న వారిని ఒక్కసారిగా తొలగించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రాణాలకు తెగించి పనులు చేసిన వారిని.. ఇప్పుడు అవసరం లేదంటూ ఇంటికి సాగనంపుతున్నారు. జీహెచ్ఎంసీ నగర శివారులో సివరేజీ నిర్వహణను తిరిగి చేపట్టిన నేపథ్యంలో వాటర్ బోర్డు నియమించుకున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించింది. దీంతో దాదాపు 600 మందికి పైగా కార్మికులు వీథినపడ్డారు.
2007లో జీహెచ్‌ఎంసీ ఏర్పాటైన సందర్భంలో విలీనమైన ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కాప్రా, అల్వాల్, మల్కాజిగిరి, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ తదితర 12 మునిసిపాలిటీలలో సివరేజీ వ్యవస్థ నిర్వహణను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. అయితే, ఆరు నెలల క్రితం ఈ బాధ్యతను వాటర్‌బోర్డుకు అప్పగించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో శివారు మునిసిపాలిటీల్లో సివరేజీ నిర్వహణ చేపడుతున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది పూర్తిగా వాటర్‌బోర్డు అధీనంలోకి వెళ్లిపోయారు. గ్రేటర్ పరిధిలో తాగు, మురుగునీటి వ్యవస్థలను వాటర్‌బోర్డు సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే శివారు సివరేజీ వ్యవస్థను వాటర్‌బోర్డుకే అప్పగించారు. శివారులోని 66వార్డు పరిధిలో 528 మంది అన్‌స్కిల్డ్ లేబర్, 132 మంది స్కిల్డ్ కార్మికులు, 44 మంది సూపర్‌వైజర్ కేడర్‌లో పనిచేస్తున్నారు. అలాగే, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని జెట్టింగ్ మిషన్లు, మినీ ఎయిర్‌టెక్ మిషన్లు సైతం వాటర్‌బోర్డు పరిధిలోకి వెళ్లాయి. ఇదే క్రమంలో మెరుగైన సేవల కోసం వాటర్ బోర్డు ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్‌లో 650 మంది కార్మికులను ఉద్యోగాలలోకి తీసుకుంది. ఒక్కో కార్మికుడికి రూ. 10,500 వేతనం కాగా, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించారు.
అయితే, గ్రేటర్ పరిధిలోని శివారు సివరేజీ నిర్వహణ తిరిగి జీహెచ్‌ఎంసీకే అప్పగించింది ప్రభుత్వం. ఈ నెల ఒకటో తేదీ నుంచి శివారులో సివరేజీ నిర్వహణ బాధ్యతలు మళ్లీ జీహెచ్‌ఎంసీ చేతికి దక్కాయి. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం వాటర్‌బోర్డుకు అప్పగించిన ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే జీహెచ్‌ఎంసీ తిరిగి తీసుకుంది. వాటర్‌బోర్డు ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమించుకున్న 650 మంది సివరేజీ కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. అక్టోబర్ ఒకటో తేదీన మధ్యాహ్నం విధుల్లో ఉన్న సమయంలోనే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జీహెచ్ఎంసీ. దీంతో కార్మికులంతా ఉపాథి కోల్పోయి దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. కష్టాన్ని నమ్ముకున్న తమకు ఉపాధి కల్పించాలంటూ వేడుకుంటున్నారు.