విషాద సమయంలోనూ అవయవదానం చేసి స్ఫూర్తిగా నిలిచిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. హైదరాబాద్(Hyderabad) రవీంద్ర భారతిలో జీవన్ దాన్ ఆధ్వర్యంలో అవయవదానం చేసిన వారి కుటుంబ సభ్యులకు సన్మానం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈయనతో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్(Srinivas Yadav) లు తదితరులు హాజరయ్యారు. 2020 సంవత్సరంలో 88 కుటుంబాలు అవయవ దానం చేశాయన్న మంత్రి హరీశ్.. కరోనా కారణంగా గతేడాది సన్మాన కార్యక్రమం నిర్వహించలేకపోయామని తెలిపారు. అవయవదానానికి కుటుంబసభ్యులు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని అభివర్ణించారు. అయిన వాళ్ళను కోల్పోయినా నలుగురికి ప్రాణదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇలాంటి నిర్ణయాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు. అవయవదానం చేసేందుకు ఇతరులు కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
మనం చనిపోయినా అవయవదానం ద్వారా ఇతరుల రూపంలో జీవించే ఉంటాం. వైద్యరంగం ఎంత అభివృద్ధి చెందినా కిడ్నీ, లివర్, హార్ట్ వంటివి ఇంకా కృత్రిమంగా తయారు చేయలేదు. కాబట్టి మన అవయవాలు మట్టిలో కలిపే కంటే దానం చేయడం ఎంతో మిన్న. బ్రెయిన్ డెడ్ అయిన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు త్వరగా నిర్ణయం తీసుకోవాలి. నలుగురికి ప్రాణం పోయాలి. దేశంలో అవయవ దానాన్ని పారదర్శకంగా ఆన్ లైన్ లో ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం, ఇతర అనేక రాష్ర్టాలు మనల్ని అనుసరిస్తున్నాయి. ఇప్పటివరకు 1000 మంది అవయవ దానం చేశారు. వారి ద్వారా సుమారు 4 వేల మంది ప్రయోజనం పొందారు.
– హరీశ్ రావు, తెలంగాణ మంత్రి
ఇప్పటి వరకు జీవన్ దాన్ లో 8 వేల మంది రిజిస్టర్ అయ్యారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇటీవల తుదిశ్వాస విడిచిన సీపీఐ నారాయణ సతీమణి వసుమతి, స్వతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం పార్థివ దేహాలను మెడికల్ కాలేజీలకు ఇచ్చి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా అవయవ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సను ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేస్తున్నామన్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లో 400 ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్స్ అయ్యాయని వెల్లడించారు. ఇందుకు ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షలు అందజేస్తున్నామని.. అంతే కాకుండా వారికి ప్రతి నెల ఉచితంగా రూ. 20 వేల విలువైన మందులు ఇస్తున్నట్లు మంత్రి హరీశ్ వివరించారు.
Also read:
Hyderabad Weather Report: తెలంగాణ వాసులకు శుభవార్త.. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో..