AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాడ్స్‌ ఓన్‌ కంట్రీలో ఓనమ్‌ పండుగ సంబరం

పది రోజుల పాటు కొత్త శోభలతో మెరిసిపోయేది! మురిసిపోయిది! ఇప్పుడూ రమణీయంగానే ఉంది కానీ.. మునుపటంత కాదు.. మలయాళీలంతా ఘనంగా జరుపుకునే ఓనమ్‌ పండుగకోసం కేరళ బాగానే ముస్తాబయ్యింది.. బలిచక్రవర్తి ఆగమనం కోసం వారంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే గాడ్స్‌ ఓన్‌ కంట్రీ కేరళలో ప్రతిరోజూ ఓ వేడుకే...!

గాడ్స్‌ ఓన్‌ కంట్రీలో ఓనమ్‌ పండుగ సంబరం
Balu
|

Updated on: Aug 31, 2020 | 10:43 AM

Share

ఈ సమయంలో పాడు కరోనా లేకపోయింటే కేరళ ఎంత బాగుండేదో! పది రోజుల పాటు కొత్త శోభలతో మెరిసిపోయేది! మురిసిపోయిది! ఇప్పుడూ రమణీయంగానే ఉంది కానీ.. మునుపటంత కాదు.. మలయాళీలంతా ఘనంగా జరుపుకునే ఓనమ్‌ పండుగకోసం కేరళ బాగానే ముస్తాబయ్యింది.. బలిచక్రవర్తి ఆగమనం కోసం వారంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే గాడ్స్‌ ఓన్‌ కంట్రీ కేరళలో ప్రతిరోజూ ఓ వేడుకే…! ప్రతి మాసం ఓ పండుగే! ఏడాది పొడవునా ఏదో ఒక పర్వదినం అక్కడ ఉత్సాహభరిత సౌరభాలను వెదజల్లుతుంటుంది.. గుళ్లు గోపురాలలలో జరిగే ఉత్సవాల సంగతి సరేసరి! ఇప్పుడు కేరళవాసులు ఓనమ్‌ వేడుకలలో మునిగితేలుతున్నారు. వారు జరుపుకునే అత్యంత గొప్ప పండుగ ఇదే! మలయాళీల హృదయ స్పందనా ఇదే! బలిచక్రవర్తి స్వయంగా వచ్చి తమ ఆనందోత్సవాలను తిలకించి మురిసిపోతాడనే నమ్మకం..! ఆ నమ్మకమే ఓనమ్‌ పండుగకే ప్రేరణ!

ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకున్న బలి చక్రవర్తి

బలిచక్రవర్తి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండేవారు.. రాజ్యం సుభిక్షంగా ఉండింది.. ధర్మం నాలుగు పాదాలా నడిచింది. తన ప్రజలకు ఎలాంటి కష్టనష్టాలు కలగకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాడాయన! అందుకే బలిచక్రవర్తి అంటే కేరళ ప్రజలకు అంత ఇష్టం.. దైవంతో సమానం! విష్ణుమూర్తి మూడో అడుగును నెత్తిన పెట్టుకున్న బలిచక్రవర్తి పాతాళానికి వెళ్లే ముందు ఆ వైకుంఠవాసుడిని ఓ వరం అడుగుతాడు.. ఏడాదికోసారి తన ప్రజలను చూసే భాగ్యాన్ని ప్రసాదించమంటాడు.. విష్ణుమూర్తి తథాస్తూ అన్నాడు.. అప్పటి నుంచి ప్రతి ఏడాది బలిచక్రవర్తి తమ ఇళ్లకు వచ్చి తమ సంతోషాన్ని చూస్తాడన్నది ప్రజల నమ్మకం.. బలిచక్రవర్తి భూలోకానికి వచ్చే రోజునే ఓనమ్‌ పండుగగా జరుపుకుంటారు. అసలు బలిచక్రవర్తిని విష్ణుమూర్తి పాతాళానికి తొక్కేయలేదని… అసలు ఆ పరంధాముడు తన పాదాన్ని బలి నెత్తి మీద పెట్టలేదని కేరళ వాసుల గట్టి నమ్మకం.. బలి చక్రవర్తికి సువర్లోక పాలన బాధ్యతలను అప్పగించిన విష్ణువు ఆయన ద్వారపాలకుడిగా మారాడంటారు.

చింగమాసంలో వచ్చే పండుగ ఓనమ్‌

మలయాళీల క్యాలెండర్‌ ప్రకారం చింగ మాసంలో వస్తుందీ పండుగ..వారి కొల్లవర్షమ్‌లో మొదటి నెల ఇది! పది రోజుల పాటు ఓనమ్‌ వేడుకలు జరుగుతాయి. ఓనం తర్వాత కూడా కొన్ని చోట్ల ఉత్సవాలు జరుగుతాయి.. ఓ చింగమాసం మొత్తం పండుగ సందడి నెలకొంటుందక్కడ! ఇళ్ల ముందు రంగురంగుల పువ్వులతో అలంకరించిన రంగవల్లికలు ఓనమ్‌ ప్రత్యేక ఆకర్షణ. ఒక్కోరోజు ఒక్కో రంగు పువ్వులను కోసుకొచ్చి తమ సృజనాత్మకతనంతా ఆ రంగవల్లికలో చూపిస్తారు. . రకరకాల ఆకృతుల్లో ముగ్గులను తీర్చి దిద్దుతారు. కడుపు చేత పట్టుకుని పరాయి దేశాలకు వెళ్లినవారిని సొంతూళ్లకు రప్పించే గొప్ప పండుగ ఇది.. అందుకే మలయాళీలకు ఇంత ఇష్టం..

పది రోజుల వేడుకలలో తిరు ఓనమ్‌ ప్రధానం

ఓనమ్‌ పండుగ ముందు రోజు ఉత్తరాడం.. తాము ఆరాధించే బలిచక్రవర్తి వచ్చే రోజు ఆసన్నమయ్యిందన్న సంబరం.. ఆయనకు స్వాగతం చెప్పాలన్న ఉత్సాహం.. ఉత్తరాడమ్‌ను మొదటి ఓనమ్‌గానూ.. తిరు ఓనమ్‌ను రెండో ఓనమ్‌గానూ జరుపుకుంటారు కేరళ ప్రజలు.. పది రోజుల ఓనమ్‌ వేడుకలలో చివరిది తిరు ఓనమ్‌.. ఇదే ప్రధాన పండుగ.. వేకువజామునే నిద్రలేచి… అభ్యంగన స్నానమాచరించి .. కొత్త దుస్తులు ధరించి .. దగ్గరున్న గుడికెళ్లి …దైవదర్శనాన్ని చేసుకుంటారు.. తొలి సంజే వేళకే ఇంటి ముందు పూక్కాలమ్‌ రెడీ అవుతుంది.. అమ్మాయిలు పోటీపడి మరి రంగవల్లికలను తీర్చిదిద్దుతారు.. చిన్నపిల్లలు పూల రంగవల్లికలకు కాపలా ఉంటారు. . ఓనమ్‌ చీరలతో తిరుగాడే అమ్మాయిలే దర్శనమిస్తారు… ఓనమ్‌ పాటలే వినిపిస్తుంటాయి.. పండగకు అర్థం ఓనమ్‌ను చూస్తే తెలిసిపోతుంది.. యువకులు శారీరకశ్రమనిచ్చే ఆటలు ఆడతారు. పెద్దవారు మాత్రం ఇంట్లోనే ఉంటూ చదరంగం.. పులిజూదం ఇత్యాది ఆటలు ఆడుకుంటారు. విలువిద్యాపోటీలు.. కత్తియుద్ధాలవంటి క్రీడలు కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. కబడ్డీ ఆటను కూడా ఇష్టంగా ఆడతారు.

కైకొట్టికలై, తుంబి తుల్లర్‌ నృత్యాలు సుప్రసిద్ధం

ఓనమ్‌ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన నాట్యాలున్నాయి.. వీటిల్లో కైకొట్టికలై.. తుంబి తుల్లర్‌లు చాలా ముఖ్యమైనవి..ఓనమ్‌ రోజున ఎక్కడ చూసినా కేరళ సంప్రదాయ చీరలు కట్టుకున్న అమ్మాయిలు కైకొట్టికలై ఆడుతూ కనిపిస్తారు. ఇక తిరుఓనమ్‌ రోజున తయారుచేసే ఓనంసద్య అనే విందు పండుగలో అతి గొప్ప భాగం.. పదకొండు నుంచి పదమూడు అతి ముఖ్యమైన పదార్థాలతో కూడిన తొమ్మిది రకాల భోజనమన్నమాట! ఇందులో రకరకాల పచ్చళ్లు ఉంటాయి.. అప్పడాలుంటాయి.. పాయసాలుంటాయి.. నేంద్రపళం అనే ఓ రకమైన అరటికాయతో చేసిన చిప్స్‌ కూడా ఉంటాయి.. ఓనసద్యను అరటి ఆకుల్లో వడ్డిస్తారు.. కుటుంబసభ్యులంతా కూర్చొని ఆనందంగా సందడి చేస్తూ భోజనం చేస్తారు. వడ్డించడం కూడా ఓ కళే అంటారు.. అది ఓనసద్య నుంచే పుట్టిందేమో! ఎందుకంటే అంత కచ్చితంగా ఉంటుందీ వడ్డన!ఇప్పుడైతే కూరల సంఖ్య తగ్గింది కానీ..ఒకప్పుడైతే 64 రకాల వంటకాలుండేవట!

పండుగ వేళ కథాకళి నృత్యం తప్పనిసరి

పండగ రోజు కథాకళి నృత్యం తప్పనిసరిగా వుండి తీరాల్సిందే… పురాణగాధలను అభినయిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తారు కళాకారులు.. ఏనుగుల ఊరేగింపు కన్నుల పండువగా సాగుతుంది…త్రిస్సూరు దగ్గర్నుంచి బయలు దేరే ఈ ఊరేగింపు వీధి వీధిని చుట్టేస్తుంది…ఇక్కడే ముసుగులు ధరించిన కళాకారులు అందమైన కుమ్మట్టికలి నృత్యాన్ని అభినయిస్తూ ఇంటింటికి వెళతారు.. ఓనం వేడుకల్లో ఊయలలూగడం ఓ అంతర్భాగం… గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.. కేరళ సంప్రదాయ చీరలతో అందంగా ముస్తాబైన అమ్మాయిలు ఊయ్యాలూగుతూ ఓనం పాటలు పాడతారు. వినాయక చవితి పండగ రోజున విఘ్నేశ్వరుడి ప్రతిమలను ప్రతిష్టించినట్టుగా ఓనం పండుగ రోజుల్లో త్రిక్కకర అప్పన్‌…అంటే వామనుడి రూపంలో వున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తమ ఇళ్లలో ప్రతిష్టిస్తారు. కేరళలలో అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగను ఉత్సహాంగా జరుపుకుంటారు.. ఓనం హిందుమతానికి సంబంధించిన పండగే కానీ.. హిందువులతో సరిసమానంగా ముస్లిములు..క్రైస్తవులు కూడా జరుపుకుంటారు.. సమైక్య భావనకు ఇదో దర్పణం..

మలయాళీలు ఉన్న ప్రతిచోటా పండుగ సంబరం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్‌కీ బాత్‌లో ప్రస్తావించినట్టు ఓనమ్‌ వైభవం కేరళలోనే కాదు.. మలయాళీలున్న ప్రతిచోటా ఆ సంబరం కనిపిస్తుంది.. విదేశాలలో స్థిరపడిన మలయాళీలు ఓనమ్‌ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అందరూ ఒక్కచోటకు చేరి సంబరాలు చేసుకుంటారు.. రోజంతా ఆనందంగా గడిపేస్తారు.. నిజానికి తిరుఓనమ్‌తో పండుగ ఉత్సవాలు ముగియాలి.. కానీ ఓనమ్‌ తర్వాతి రెండు రోజులు కూడా ప్రజలు సెలెబ్రేషన్స్‌ చేసుకుంటారు. ఓనమ్‌ మరుసటి రోజును అవిట్టమ్‌ అంటారు. పది రోజులుగా పూక్కాలమ్‌లో ప్రతిష్టించిన ఓనటప్పన్‌ విగ్రహాన్ని సమీపంలో ఉన్న నదిలోనో.. చెరువులోనో నిమజ్జనం చేస్తారు. పులిక్కలి నృత్యాలు ఈ రోజుకు మరింత శోభనిస్తాయి.. ఆ మరుసటి రోజును చట్యమ్‌ అంటారు. సంఘసంస్కర్త శ్రీ నారాయణగురు జయంతి.. ఇదే రోజున తిరువనంతపురంలో ప్రభుత్వం డాన్స్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంది..

పులిక్కలి అక్కడ చాలా ఫేమస్‌!

పులి నృత్యాలనండి.. లేదా పులివేషాలనండి…మనం ఏ పేరుతో పిల్చుకున్నా.. కేరళలో మాత్రం పులిక్కలిగా చాలా ఫేమస్‌..! ఓనమ్‌కు ఇదో అదనపు ఆకర్షణ… తిరు ఓనమ్‌ నుంచి నాలుగో రోజున అంటే నలామ్‌ ఓనమ్‌ రోజున పులిక్కలి ఉత్సవాలు జరుగుతాయి.. త్రిసూర్‌లో అయితే చాలా గ్రాండ్‌గా జరుగుతుంది.. శాస్ర్తీయ వాయిద్యాల సవ్వడులకు అనుగుణంగా పులి వేషాలు కట్టినవారు నృత్యాలు చేయడమనేది అనాదిగా వస్తున్న ఆచారం.. భారతదేశంలోనే అతి ప్రాచీన వేడుక ఇది! పులిక్కలి అంటే పులి ఆటలు అని అర్థం…ఇది అచ్చమైన జానపదం… ఆ రోజున ఎక్కడెక్కడనుంచో పులివేషధారులు త్రిసూర్‌కు చేరుకుంటారు.. తమ కళానైపుణ్యాలను ప్రదర్శిస్తారు. పులిక్కలి వేడుకలకు రెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది.. కోచిన్‌ మహారాజు రామవర్మ సక్తాన్‌ తంబురాన్‌ ఈ జానపద కళను పాపులర్‌ చేశారు. ఓనమ్‌ వేడుకలకు పులిక్కలిని ప్రత్యేక ఆకర్షణగా నిలిపాడు. ఒకప్పుడు మొహాలకు మాస్కులు ఉండేవి కావు.. మొహాన్ని కూడా పెయింట్‌ చేసుకునేవారు ఇప్పుడన్నీ రెడీమేడ్‌ దొరుకుతున్నాయి.. ఇప్పుడు త్రిసూర్‌ పులిక్కలి ప్రధాన ఈవెంట్‌గా మారింది..

ఏటేటా ప్రజల ఆదరణ కూడా పెరుగుతూ వస్తోంది.. ఇందులో పాల్గొనేందుకు యువత ఆసక్తి కనబరుస్తోంది.. స్పాన్సర్లు కూడా ముందుకొస్తున్నారు. ఈ వేడుకలను పులిక్కలి కో ఆర్డినేషన్‌ కమిటీ నిర్వహిస్తుంది.. ఇందులో పాల్గొనే ప్రతి పులిక్కలి బృందానికి త్రిసూర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ 30 వేల రూపాయలు పారితోషికంగా ఇస్తుంది.. పులి వేషం వేయడం అంత ఆషామాషీ కాదు.. అసలు శరీరానికి పెయింట్‌ వేసుకోవడమే పెద్ద తలనొప్పి.. ఉత్తి మేకప్పుకే ఆరేడు గంటల సమయం పడుతుంది… పులివేషధారులు ఓ రకంగా పులివేటగాళ్లు మరోరకంగా మేకప్‌ వేసుకుంటారు.. మొన్నటి వరకు ఇది కేవలం పురుషుల క్రీడగానే ఉండింది.. ఇప్పుడు మహిళలు కూడా పులి వేషాలు ధరిస్తున్నారు.. పురుషులకు తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు.