కరోనా మహమ్మారి ధాటికి ఆస్పత్రులు సైతం మూతపడ్డాయి. ప్రత్యేకించి కొవిడ్ రోగులకు తప్ప ఇతరులను ఎవ్వరిని ఆస్పత్రుల్లో చేరుకునేందుకు ముందు రాలేదు. దీంతో ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు నానాయాతన అనుభవించారు. అటు గ్రేటర్ వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న కొవిడ్ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కేవలం గాంధీ ఆసుపత్రిలో మాత్రమే కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఇందులో కూడా 500 మందిపైనే ఐసీయూలో ఉన్నవారు మాత్రమే ఉంటున్నారు. వందమంది ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంది.
అయితే, మిగతా ఆసుపత్రుల్లో సగానికిపైగా పడకలు ఖాళీగా ఉంటున్నాయి. ఈనేపథ్యంలో ఆయా ఆసుపత్రుల్లో ఇతర సేవలను కూడా నెమ్మదిగా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కరోనా కేసులు ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో నగరంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ సేవలకే పరిమితం చేశారు. ఉస్మానియాలో మాత్రం 50పైగా ఐసోలేషన్ పడకలతోపాటు ఇతర సాధారణ సేవలు కొనసాగించారు. గాంధీ ఆసుపత్రిలో ఇతర వైద్య సేవలను పూర్తిగా నిలిపేసి కొవిడ్‌కే పరిమితం చేశారు.
గత కొన్నిరోజులుగా గ్రేటర్‌లో కేసుల ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండటంతో ఇతర వైద్య సేవలను కూడా కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. వారంరోజులుగా 250-300 మధ్యనే కేసుల సంఖ్య ఉంటోంది. అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో నిత్యం 150-200 పరీక్షలు చేస్తున్నారు. అక్కడ కూడా తక్కువగానే కేసులు నిర్ధారణ అవుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. తాజాగా మంగళవారం మలక్‌పేట, జాంబాగ్ పార్క్, మాదన్నపేట, గడ్డిఅన్నారం, శాలివాహన నగర్ పరిధిలో 321 మందికి పరీక్షలు చేస్తే కేవలం 16 మందిలో కరోనా లక్షణాలు కనిపింయాయి.
ఇక, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో 56 మందికి యాంటీజన్ పరీక్షలు నిర్వహిస్తే ముగ్గురికే మాత్రమే కరోనా నిర్థారణ అయ్యింది. చాలామందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందడం ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారిలోనూ 95 మంది ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. తీవ్ర జ్వరం, ఆయాసం, ఆక్సిజన్ తగ్గడం, ఇతర సమస్యలు ఉన్నవారే ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గడిచిన 24 గంటల్లో గ్రేటర్ పరిధిలో 292 మంది కరోనా బారిన పడ్డారు. మేడ్చల్ జిల్లాలో 145 మందికి, రంగారెడ్డి జిల్లాలో 187 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
దీంతో అధికారులు హైదరాబాద్ పరిధిలో ప్రధాన ఆస్పత్రులను తెరిపించి పూర్తిస్థాయి వైద్య సేవలను కొనసాగించాలని నిర్ణయించారు. ఇందు కోసం వైద్య సిబ్బంది అనుసరించాల్సిన నిబంధనలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. త్వరలో అన్ని రంగాల సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.