జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు క్యాబినెట్ ర్యాంకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సర్జికల్ స్ట్రయిక్స్, ఎయిర్ స్ట్రయిక్స్ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జాతీయ భద్రత కోసం ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన మరో అయిదేళ్ళ పాటు ఎన్డీఏ ప్రభుత్వానికి జాతీయ భద్రతా సలహాదారుగా ఉంటారు. మరోవైపు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలిపారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించేందుకు కేంద్రం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ప్రధానికి అదనపు కార్యదర్శిగా ఉన్న ప్రమోద్ కుమార్ మిశ్రా (పీకే మిశ్రా) ప్రస్తుత బాధ్యతల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా ప్రధాని మోడీని కోరారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవాల్సి ఉందని ఆయన అంటున్నారు. అలాగే ప్రధానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్న నృపేంద్ర మిశ్రా కూడా ప్రస్తుత పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారు. అయితే ఆయనను రిలీవ్ చేసేందుకు ప్రధాని సానుకూలత వ్యక్తం చేయడంలేదని సమాచారం.