దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ వైరస్ కారణంగా ఆటోమొబైల్ రంగం తీవ్రంగా నష్టపోయింది. గత రెండేళ్లుగా ఈ పరిశ్రమలో మందగమనం కొనసాగుతోంది. దానికి తోడు కరోనా తోడవటంతో ఈ పరిశ్రమ అతలాకుతలమయ్యింది. అయితే, లాక్ డౌన్ ఎత్తివేసి సుమారు రెండు నెలలు గడుస్తున్న తరుణంలో మిగితా పరిశ్రమల కంటే ముందుగా కోలుకుంటున్నది కూడా ఇదే పరిశ్రమ అని చెప్పొచ్చు.
ఆటోమొబైల్ కంపెనీలు అధిక వేగంతో కోలుకుంటుండటంతో జోష్ మొదలైంది. దీంతో ఆ కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ, ఇంక్రిమెంట్లు, బోనస్ లు ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నాయి. కరోనా వైరస్ దాడి తర్వాత దేశంలో ఉద్యోగాలు. జీతాల్లో కోత మాత్రమే కనిపించింది. ఇది అన్ని రంగాలకూ విస్తరించింది. కానీ, ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ పుంజుకుని తమ ఉద్యోగులకు ఇంత తీపి కబురు అందించటంతో… మిగితా రంగాలకు కూడా భవిష్యత్ పై భరోసా కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్రమంగా మళ్ళీ జాబ్ మార్కెట్ కోలుకునే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.