రాత్రి వేళ పనిచేసేవారూ జాగ్రత్త.. గుండె ఆరోగ్యంపై కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు!
నేటి మారుతున్న పని సంస్కృతిలో ఉద్యోగం అంటే కేవలం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయడం మాత్రమే కాదు. ఐటీ కంపెనీలు, కాల్ సెంటర్లు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, భద్రతా సేవలు.. ఇలా అనేక రంగాల్లో వేలాది మంది రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. కొందరికి ఇది తప్పనిసరి కాగా, మరికొందరు అదనపు ఆదాయం లేదా ఉద్యోగ సౌలభ్యం కోసం నైట్ షిఫ్టులను ఎంచుకుంటున్నారు. అయితే రాత్రంతా మేల్కొని ఉండటం, పగటిపూట నిద్రపోవడం దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?

నేటి మారుతున్న పని సంస్కృతిలో ఉద్యోగం అంటే కేవలం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయడం మాత్రమే కాదు. ఐటీ కంపెనీలు, కాల్ సెంటర్లు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, భద్రతా సేవలు.. ఇలా అనేక రంగాల్లో వేలాది మంది రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. కొందరికి ఇది తప్పనిసరి కాగా, మరికొందరు అదనపు ఆదాయం లేదా ఉద్యోగ సౌలభ్యం కోసం నైట్ షిఫ్టులను ఎంచుకుంటున్నారు. అయితే రాత్రంతా మేల్కొని ఉండటం, పగటిపూట నిద్రపోవడం దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఇది ప్రమాదకరమా? అనే ప్రశ్నలకు తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
రాత్రి షిఫ్టులతో గుండె నిర్మాణంలో మార్పులు?
యూరోపియన్ హార్ట్ జర్నల్ – కార్డియోవాస్కులర్ ఇమేజింగ్‌లో నవంబర్ 19, 2026న ప్రచురితమైన అధ్యయనంలో 42,671 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. వీరంతా యూకే బయోబ్యాంక్‌కు చెందినవారు కాగా, పాల్గొన్నవారి సగటు వయస్సు సుమారు 52 సంవత్సరాలు. వీరిలో 1,322 మంది క్రమం తప్పకుండా రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు. పరిశోధకులు కార్డియాక్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (Cardiac MRI) ద్వారా వీరి గుండె నిర్మాణం, పనితీరును పరిశీలించారు. ఈ విశ్లేషణలో క్రమం తప్పకుండా రాత్రి షిఫ్టుల్లో పనిచేసే వారిలో గుండె ప్రధాన పంపింగ్ గది గోడలు కొంత మందంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే గుండెలోని కొన్ని గదుల పరిమాణం కూడా కొద్దిగా తగ్గినట్లు పరిశోధనలో వెల్లడైంది.
అయితే గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ఎజెక్షన్ ఫ్రాక్షన్ (Ejection Fraction)లో మాత్రం గణనీయమైన తేడాలు కనిపించలేదు. అంటే రాత్రి షిఫ్టుల్లో పనిచేసే వారందరికీ గుండె పనితీరు దెబ్బతింటుందని ఈ అధ్యయనం నిర్ధారించలేదు. కానీ గుండె నిర్మాణంలో కొన్ని మార్పులు ఉండే అవకాశాన్ని సూచించింది.
రక్తంలోనూ కొన్ని మార్పులు గుర్తింపు
గుండె నిర్మాణంతో పాటు పరిశోధకులు రక్తంలో గుండె ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా పరిశీలించారు. క్రమం తప్పకుండా రాత్రి షిఫ్టుల్లో పనిచేసే వారిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లో ముఖ్యమైన DHA స్థాయులు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే మంచి కొలెస్ట్రాల్‌గా పరిగణించే HDLకు సంబంధించిన కొన్ని సూచికల్లో మార్పులు కనిపించాయి. ట్రైగ్లిజరైడ్లు, శరీరంలో వాపును సూచించే కొన్ని ఇతర మార్కర్లు కూడా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధన పేర్కొంది. ఈ మార్పులు గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాద కారకాలుగా పరిగణించబడవచ్చు.
శరీర జీవ గడియారానికి అంతరాయం
మన శరీరంలో సర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) అనే సహజ జీవ గడియారం ఉంటుంది. ఇది ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు మేల్కొనాలి, హార్మోన్లు ఎప్పుడు విడుదల కావాలి, శరీరంలోని జీవక్రియలు ఏ సమయంలో చురుకుగా ఉండాలి వంటి అనేక ప్రక్రియలను నియంత్రిస్తుంది. సాధారణంగా మన శరీరం రాత్రి నిద్రపోవడానికి, పగటిపూట చురుకుగా ఉండటానికి అనుగుణంగా పనిచేస్తుంది. కానీ నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారు ఈ సహజ క్రమానికి భిన్నంగా రాత్రి మేల్కొని, పగటిపూట నిద్రపోవాల్సి వస్తుంది. ఇలా దీర్ఘకాలం కొనసాగితే శరీర సహజ జీవ గడియారం, పని సమయాల మధ్య సమన్వయం దెబ్బతినవచ్చు. ఈ ప్రభావం జీవక్రియ, రక్తపోటు, హార్మోన్ల సమతుల్యత, శరీరంలోని వాపు వంటి అంశాలపై పడే అవకాశం ఉంటుంది. కాలక్రమంలో ఈ మార్పులు గుండె సంబంధిత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్నవారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం. పని వేళలు మారినా నిద్రకు తగిన సమయం కేటాయించడం చాలా ముఖ్యం. పని ముగిసిన తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో, వీలైనంత నిరంతరాయంగా నిద్రపోయేలా చూసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, పోషకాలు ఉన్న పదార్థాలను చేర్చుకోవాలి. రోజూ కొంత సమయం నడక లేదా ఇతర శారీరక వ్యాయామాలకు కేటాయించాలి. బరువు పెరగకుండా చూసుకోవడంతో పాటు రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయులను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం మంచిది.
ప్రతి నైట్ షిఫ్ట్ ఉద్యోగికీ గుండె సమస్యలు వస్తాయా?
రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ గుండె సమస్యలు వస్తాయని ఈ అధ్యయనం చెప్పడం లేదు. పరిశోధనలో కనిపించిన మార్పులు గుండె నిర్మాణం, కొన్ని రక్త సూచికలకు సంబంధించినవి మాత్రమే. వీటి ఆధారంగా ప్రతి ఒక్కరికీ గుండె జబ్బు వస్తుందని నిర్ధారించలేం. అయితే రాత్రి షిఫ్టుల్లో ఎక్కువకాలం పనిచేసేవారు నిద్ర, ఆహారం, వ్యాయామం వంటి అంశాలను నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని ఈ పరిశోధన మరోసారి గుర్తు చేస్తోంది. ఉద్యోగ బాధ్యతలు ఎంత ముఖ్యమైనవైనా, వాటితో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
