
Newly-married couple quarantined: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలన్ని అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో పెళ్లైన కొద్ది గంటల్లోనే వధూవరులతో సహా సుమారు 100 మంది బంధుమిత్రులను క్వారెంటైన్‌కు తరలించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో చోటుచేసుకుంది. వధువు బంధువుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతోనే వారిని ప్రభుత్వ క్వారెంటైన్ కేంద్రాలకు తరలించామని జిల్లా అధికారి వెల్లడించారు.
కాగా.. సెంట్రల్ ఇండిస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్)లో వధువు బంధువు ఒకరు విధులు నిర్వర్తిస్తున్నారు. గతవారం ఆయన ఛింద్వారా జిల్లాలోని జున్నార్దియోలో ఉన్న తన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అతను జిల్లా సరిహద్దుల్లో ప్రవేశిస్తుండగా అధికారులు స్క్రీనింగ్ పరీక్షలు జరిపి అనుమతించారు. ఇంటికి వచ్చాక అతను ఇతర ప్రాంతాల్లోని కొందరు బంధువులను కలిశారు. అలాగే మే 26న ఛింద్వారాలో జరిగిన తన మరదలి పెళ్లికి హాజరయ్యారు.
మరోవైపు.. అతనిలో గత కొద్దిరోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేశామని, వైరస్ సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయిందని కలెక్టర్ సౌరభ్ సుమన్ స్పష్టంచేశారు. ఆ వ్యక్తి తన మరదలి పెళ్లికి హాజరవ్వడంతో నూతన వధువరులతో సహా మొత్తం కుటుంబసభ్యులను, పెళ్లికి హాజరైన వారిని మూడు ప్రభుత్వ క్వారెంటైన్ కేంద్రాలకు తరలించామని తెలిపారు. తర్వాత అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.