Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కడుపులో కత్తులు పెట్టుకుని ప్రేమపూర్వక కౌగిలింతలు, చీరాలలో ఉప్పు నిప్పులా ఉండే ఇద్దరు నేతల కొత్త యాక్షన్.!

ప్రకాశం జిల్లా చీరాలలో నిన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు...

కడుపులో కత్తులు పెట్టుకుని ప్రేమపూర్వక కౌగిలింతలు, చీరాలలో ఉప్పు నిప్పులా ఉండే ఇద్దరు నేతల కొత్త యాక్షన్.!
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 26, 2020 | 9:06 AM

ప్రకాశం జిల్లా చీరాలలో నిన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు కొత్త టచ్ ఇచ్చారు. ఒకే వేదికపై పొందిక, కుదురు ప్రదర్శించారు. చీరాలలో జరిగిన పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ కార్యక్రమంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఏపి విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి అటుపక్క కరణం, ఇటు పక్క ఆమంచి ఎలాంటి విబేధాలు ప్రదర్శించకుండా కామ్‌గా సెటిలయ్యారు. కాగా, ఇటీవల చీరాలలో మత్స్యకారుల మధ్య నెలకొన్న గొడవల నేపధ్యంలో కరణం, ఆమంచి వర్గీయుల మధ్య మళ్లీ ఘర్షణలకు అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వైసీపీకి చెందిన ఈ ఇద్దరు నేతలు తిరిగి ఒకే వేదికపైకి వస్తే ఉద్రిక్తతలు నెలకొంటాయన్న ఉద్దేశ్యంతో పోలీసులు వేదికపై నాయకులను తప్ప వారి అనుచరులను అనుమతించలేదు… సభా ప్రాంగణానికి కూడా రాకుండా ముందే ఇరువైపులా కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో వేదికపై మంత్రి బాలినేనితో పాటు ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, కరణం వెంకటేష్‌లు మాత్రమే ఆశీనులయ్యారు. అనంతరం కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆధ్వర్యంలో పేద లబ్దిదారులకు ఇళ్ళ స్థలాలను మంత్రి బాలినేని పంపిణీ చేశారు.

ఇటీవల మత్స్యకారుల మధ్య గొడవల్లో కరణం, ఆమంచి అనుచరులు ఆధిపత్య పోరు ప్రదర్శించారు. మత్స్యకారుల మద్య వలల విషయంలో చోటు చేసుకున్న వివాదం ఒకేపార్టీకి చెందిన ఇద్దరు రాజకీయ నేతల మధ్య ఆధిపత్య పోరుతో రాజకీయ రంగు పులుముకోవడంతో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ రంగంలోకి దిగారు. అయితే మోపిదేవి సమక్షంలోనే చీరాలలో ఇటు కరణం, అటు ఆమంచి వర్గీయులు మళ్ళీ ఘర్షణలు పడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరింది. అయితే ప్రభుత్వం చేపట్టిన పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమంలో మళ్ళీ అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరుతో ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో ట్రబుల్‌ షూటర్‌గా మంత్రి బాలినేని శ్రీనువాసులురెడ్డి రంగంలోకి దిగారు. చీరాలలో ఒకే వేదికపై అటు ఎమ్మెల్యే కరణం బలరాం, ఇటు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లను కూర్చోబెట్టుకుని కార్యక్రమాన్ని విజయవంతంగా ఎలాంటి గొడవలు లేకుండా నడిపించారు. ఈ ఘట్టాన్ని చూసిన ఇరువైపుల కార్యకర్తలు హమ్మయ్య అనుకుని ఊపిరిపీల్చుకున్నారు. అయితే మంత్రి బాలినేని ఉన్నారు కాబట్టి ఇద్దరు నేతలు కడుపులో కత్తులు పెట్టుకుని పైకి కౌగిలించుకున్నట్టున్నారు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలినేని సమక్షంలో ఒకే వేదికపై ఇద్దరూ కలిసి ఉన్నా ఎడమొహం, పెడమొహంగానే వ్యవహరించారు.