Second Covid Vaccination Dry Run: నేడు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రెండో విడత కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చైన్నై లోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాట్లు ను పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. మరికొన్ని రోజుల్లో దేశ ప్రజలకు కరోనా టీకా అందుబాటులోకి రానుందని చెప్పారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నివారణకు అతి తక్కువ సమయంలో భారత్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. ముందుగా ఈ టీకాను కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలను అందించిన వైద్యారోగ్య సిబ్బందికి.. తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందజేస్తామని చెప్పారు హర్షవర్ధన్. టీకాకు సంబంధించిన సమాచారం క్షేత్రస్థాయి వరకు అందేలా జాగ్రత్తలు తీసుకున్నామని.. ఇప్పటికే లక్షలాది మంది సిబ్బందికి శిక్షణనిచ్చాం. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. దేశ వ్యాప్తంగా టీకాను ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి అందరికీ వివరించారు.
ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డ్రై రన్ నిర్వహించగా.. తాజాగా శుక్రవారం సెకండ్ వ్యాక్సిన్ డ్రై రన్ ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 736 జిల్లాల్లో ప్రారంభమైంది. ఈ డ్రై రన్ లో డ్రైరన్‌లో భాగంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు ప్రజలు, ఆరోగ్యసిబ్బంది పాటించాల్సిన అంశాలు, టీకా ఇచ్చాక ఏవైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్షణం అందించాల్సిన చికిత్స గురించి అవగాహన కల్పిస్తున్నారు. టీకా లబ్ధిదారులు కేంద్రానికి వచ్చేలా సమీకరించడం, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వరుసల్లో నిలబెట్టడం, వారి నుంచి సమాచారాన్ని కొవిన్ యాప్‌లో నమోదు చేయడం తదితర అన్ని దశలను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. తాజా డ్రైరన్‌లో ముఖ్యంగా కొవిన్ సాఫ్ట్‌వేర్ పనితీరును పరిశీలించనున్నామని అధికారులు తెలిపారు. ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని తెలుసుకుని పరిష్కరిస్తామని చెప్పారు.
Also Read: మనం కాదనుకున్న పూర్వకాలం అలవాట్లే శ్రేయస్కరమా.. రాగినీటితో రోగాలు దూరం