కేసిఆర్ అధ్వర్యంలో దేవాలయాలకు పూర్వవైభవంః ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే, సీఎం కేసిఆర్ అధ్వర్యంలో దేవాలయాలకు పూర్వవైభవం వస్తున్నదని రాష్ట్రమంత్రులు అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే, సీఎం కేసిఆర్ అధ్వర్యంలో దేవాలయాలకు పూర్వవైభవం వస్తున్నదని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలు అభివృద్ది చెందుతున్నాయని రాష్ట్రమంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతిరాథోడ్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమాలతో పాటు, దేవాలయాల పునరుద్ధరణకు కూడా సీఎం పెద్ద పీట వేస్తున్నారన్నారు. వరంగల్ లో ముగ్గురు మంత్రులు సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభించిన మంత్రులు… రాష్ట్రంలో దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. బుధవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతిరాథోడ్ పర్యటించారు.. ముందుగా భద్రకాళి ఆలయంలో పూజలు చేసిన మంత్రులు.. సెంట్రల్ జైలు సమీపంలోని 1,014 గజాల దేవాదాయశాఖ స్థలంలో నూతనంగా నిర్మించనున్న ధార్మిక భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు..
వెయ్యి కోట్లతో శ్రీ యాదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవాలయాన్ని యాదాద్రి గా అభివృద్ధి పరిచినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. త్వరలోనే, ఆ నూతన దేవాలయ ప్రాంగణం ప్రారంభమవుతుందని తెలిపారు… అలాగే స్వ రాష్ట్రంలో గోదావరి, కృష్ణ పుష్కరాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించిదని, అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల కారణంగా తుంగభద్ర పుష్కరాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే,కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు సహకరించాలని కోరారు
వరంగల్ లో నిర్మించనున్న ఈ ధార్మిక భవన్ లో 5వ జోన్ డిప్యూటీ కమిషనర్, జిల్లా సహాయ కమిషనర్ కార్యాలయాలు, మేడారం సమ్మక్క, సారలమ్మ ఈవో కార్యాలయం, ఇంజినీరింగ్ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ధార్మిక భవన్ నిర్మాణపనులకు శంకుస్థాపన అనంతరం… కాజీపేటలోని మడికొండ మెట్టుగుట్ట శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో అన్నదాన సత్రాన్నిమంత్రులు ప్రారంభించారు.