AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాళేశ్వరం తరహాలోనే పోలవరం.. మేఘా మాటంటే మాటే !

తెలంగాణకు జీవ ప్రదాయినిగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా.. రికార్డు సమయంలో పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ అటు ఆంధ్రప్రదేశ్‌ జీవధార పోలవరం ప్రాజెక్టును కూడా వేగవంతంగా పూర్తి చేసేందుకు సంసిద్ధమైంది. శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టు పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ భూమి పూజ నిర్వహించి, పనులు ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు అమరావతి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులకు శ్రీకారం చుట్టారు మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు. శుక్రవారం ఉదయం స్పిల్ […]

కాళేశ్వరం తరహాలోనే పోలవరం.. మేఘా మాటంటే మాటే !
Rajesh Sharma
|

Updated on: Nov 01, 2019 | 6:18 PM

Share
తెలంగాణకు జీవ ప్రదాయినిగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా.. రికార్డు సమయంలో పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ అటు ఆంధ్రప్రదేశ్‌ జీవధార పోలవరం ప్రాజెక్టును కూడా వేగవంతంగా పూర్తి చేసేందుకు సంసిద్ధమైంది. శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టు పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ భూమి పూజ నిర్వహించి, పనులు ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు అమరావతి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులకు శ్రీకారం చుట్టారు మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు. శుక్రవారం ఉదయం స్పిల్ వే బ్లాక్ నెంబర్ 18 వద్ద జలవనరుల శాఖ ఈఈ ఏసుబాబు సమక్షంలో పూజాధికాలు  నిర్వహించారు. భూమి పూజ తర్వాత పనులను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు గత అయిదేళ్ళుగా నత్తనడకన సాగగా.. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. అన్ని వనరులను ఉపయోగించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడమే సంస్థ లక్ష్యమని మేఘా ప్రతినిధులు తెలిపారు. రివర్స్ టెండరింగ్‌లో పోలవరం పనులను దక్కించుకున్నప్పటికీ హైకోర్టు అనుమతి లేక ఇంతకాలం ఆగిపోయిన పనుల ప్రారంభం.. గురువారం నాడు ఉన్నత న్యాయస్థానం అనుమతి ఉత్తర్వులు జారీ చేయడంతో శీఘ్రగతిన పనులకు శ్రీకారం చుట్టారు.
కాళేశ్వరం మాదిరిగా పోలవరం ప్రాజెక్టును కూడా యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో మేఘా సంస్థ పోలవరం నిర్మాణ బాధ్యతలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2005లో పనులు ప్రారంభిస్తూ హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనులను ప్యాకేజ్ వారిగా నిర్మాణ సంస్థలకు అప్పగించారు. అదే సమయంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కీలకమైన అన్ని అనుమతులను పొందింది.
అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో పోలవరం దశాబ్ద కాలం దాటినా పనులు పూర్తి చేసుకోలేకపోయింది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణిస్తామని కేంద్రం హామీనిచ్చింది. అందులో భాగంగానే 2014-2019 మధ్య కేంద్రం నిధులిస్తుండగా.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పనులను పర్యవేక్షించింది.  కానీ.. పోలవరం పనుల్లో అంతులేని అవినీతి జరిగిందని, అంఛనాలు భారీగా పెంచేసి.. ప్రభుత్వాధినేతలు పెద్దఎత్తున నిధులు దండుకున్నారన్న పొలిటికల్ ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దాంతో 2019 ఎన్నికల తర్వాత ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్. జగన్మోహన్ రెడ్డి.. రివర్స్ టెండరింగ్ తర్వాత మేఘా సంస్థకు పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. సుమారు 628 కోట్ల రూపాయలను రివర్స్ టెండరింగ్ విధానంలో రాష్ట్ర ఖజానాకు మిగిల్చామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది.
పాత కాంట్రాక్టును రద్దు చేసి రివర్స్ టెండరింగ్‌రే బిడ్లు పిలిచి, పోలవరం హెడ్ వర్కుతో పాటు జల విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని కలిపి పనులు కేటాయించారు. మేఘా ఇంజనీరింగ్ గతంలో ఈ టెండర్‌లో పనులు చేపట్టిన సంస్థల కంటే తక్కువగా 4358 కోట్ల రూపాయల మొత్తానికి పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రభుత్వానికి దీనివల్ల రూ 628  కోట్ల మొత్తంలో నిధులు ఆదా అవుతున్నాయి.
ఈ ప్రాజెక్టులో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే 4358 మొత్తానికి టెండర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో  ఎంఈఐఎల్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ శుక్రవారం పనులను ప్రారంభించింది. అనుకున్న సమయంలోనే పనులు పూర్తి చేస్తామన్న ధీమాను సంస్థ ప్రతినిధులు వ్యక్తం చేశారు.