మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా.. కొత్తగా 2,535 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 46 వేలు దాటింది.
దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 46 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్ కేసులు, వంద లోపు మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 2,535 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 60 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,49,777కు, మరణాల సంఖ్య 46,034కు పెరిగింది.
మరోవైపు ఇవాళ ఒక్కరోజే 3,001 మంది కరోనా రోగులు కోలుకుని వివిధ ఆస్పత్రులను నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 16,18,380కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 92.49 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 84,386 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.