ఉత్తరభారతంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ , రాజస్థాన్ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. మధ్యప్రదేశ్ లోని చాలా జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవితం అస్తవ్యస్థమయ్యింది. రాజస్థాన్‌లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోటా, టోంక్ జిల్లాల్లో కుంభవృష్టి కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదిలో ఓ బస్సు చిక్కుకుపోయింది. ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నా. వరదనీటిలో బస్సు కొట్టుకుపోయే ప్రమాదం ఉండడంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు 40 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
వరద ఉద్ధృతికి మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో రెండు వంతెనలు కొట్టుకుపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి మణిఖేడ ఆనకట్ట నుండి ప్రవహిస్తున్న నీటి వేగానికి వంతెన నదిలో ఒక్కసారిగా కుప్పకూలింది. మణిఖేడ డ్యామ్ 10 గేట్లు ఎత్తడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. శివపురి పట్టణం మొత్తం నీట మునిగింది. అక్కడ చిక్కుకున్న 37 మందిని ఎయిర్‌ఫోర్స్ కాపాడింది. హెలికాప్టర్లతో తాళ్ల సాయంతో వాళ్లను కాపాడారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు వరద ప్రభావానికి గురైన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తగిన సాయం చేస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని సీఎం తెలిపారు. . పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్ననేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సైన్యం సహాయంపై ప్రధాని మోదీతో చర్చించినట్టు ఆయన వెల్లడించారు.
భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలముతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు, గ్వాలియర్ చంబల్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. వరద ప్రభావిత జిల్లాలలో వైమానిక దళానికి చెందిన అనేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. అలాగే శివపురి, ష్యోపూర్, గ్వాలియర్, దాతియా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలలోని 1100లకు పైగా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తొమ్మిదింటికి ఆరెంజ్ అలర్ట్, మరో ఎనిమిది జిల్లాలకు యల్లో అలర్ట్ జారీ చేశారు. సహాయ,రక్షణ బృందాలు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: Yoga Diet: యోగా తర్వాత ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోండి.. మీలో స్టామినా పెరుగుతుంది..
UDAN scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉడాన్ పథకంలో భాగంగా 40 విమాన మార్గాలు..
IND vs ENG 1st Test Live: తొలి ఓవర్‌లోనే టీమిండియా రివేంజ్.. తిప్పేసిన బుమ్రా..