ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మధిర శాసనసభ స్థానం నుంచి రెండుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఆయన వయసు 87 ఏళ్లు.
కమ్యూనిస్ట్ నేతగా ఎదిగిన ఆయన ఖమ్మం జిల్లాలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. విద్యార్థి ఉద్యమాల నుంచే యుక్త వయసులోనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. మధిర శాసనసభ స్థానం నుంచి కట్టా వెంకట నర్సయ్య రెండుసార్లు సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదీ నుంచి ముక్కుసాటిగా వ్యవహరించే నర్సయ్య 2009 శాసనసభ ఎన్నికలకు ముందు సొంత పార్టీపై తిరుబావుటా ఎగరేశారు. పార్టీ విధానాలు, రాష్ట్ర అగ్రనాయకత్వం తీరు నచ్చక సీపీఎం నుంచి వైదొలగిన ఆయన.. గడువుకు ముందే తన శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.చనిపోయేంత వరకు కమ్యూనిస్టుగానే ఉంటానని చెప్పారు కట్టా వెంకట నర్సయ్య. కట్టా మృతి పట్ల సీపీఎం సహా పలు పార్టీల నేతలు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.