ఏపీలో మందుబాబులకు వరుసగా షాకులిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే ఈసారి ఇచ్చే షాక్‌తో మందుబాబులకు దిమ్మ తిరిగిపోవడం ఖాయమంటున్నారు. ఇంతకీ ఏంటా షాక్?
ఏపీలో విడతల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి… అనుకున్నట్లే చేస్తున్నారు. తొలుత రాష్ట్రంలోని వైన్సు షాపుల సంఖ్యను 20 శాతం తగ్గించిన జగన్ ప్రభుత్వం.. ఆ తర్వాత బార్‌ల సంఖ్యను ఏకంగా 40 శాతం కుదించాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయానికి హైకోర్టు తాజాగా మోకాలడ్డిన సంగతి తెలిసిందే. బార్ల సంఖ్యను తగ్గించాలన్న నిర్ణయంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. అయితే.. బార్ల లైసెన్సు ముగిసే వరకే ఈ స్టే అమల్లో వుంటుంది కాబట్టి ఆ తర్వాత ఎలాగో బార్ల సంఖ్య తగ్గక మానదు.
ఇక డిసెంబర్ 4న జారీ చేసిన ఉత్తర్వులతో రాష్ట్రంలో లిక్కర్ ధరలను అమాంతం పెంచేసింది జగన్ ప్రభుత్వం. మద్యం ధరలను 20 నుంచి 40 శాతం పెంచేసింది సర్కార్. ఈ నిర్ణయమే మందుబాబులకు మింగుడు పడని పరిస్థితి వుంటే.. తాజాగా జగన్ ఇంకో షాకింగ్ న్యూస్ వినిపించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
ఏపీలో ఇక మద్యం కొనాలంటే లిక్కర్ కార్డులను తప్పనిసరి చేస్తోంది జగన్ ప్రభుత్వం. వైన్సులకు వెళ్ళే మందుబాబులు లిక్కర్ కార్డు చూపిస్తేనే.. నిర్ణీత పరిమాణంలో మద్యాన్ని విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే రేషన్ కార్డు మాదిరిగా లిక్కర్ కార్డులపై నిర్ణీత పరిమాణంలోనే మద్యం కొనే అవకాశం వుంటుందన్నమాట. లిక్కర్ కార్డులపై ఒకటి, రెండు రోజుల్లోనే ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడతాయని అమరావతి వర్గాల సమాచారం.