కేటీఆర్‌కు కొత్త ఒత్తిడి… నెగ్గేనా? తగ్గేనా?
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త ఒత్తడిని ఎదుర్కొంటున్నారట. చేపట్టిన ప్రతీ టాస్క్‌ని వందశాతం నెరవేరుస్తున్న కేటీఆర్‌పై ఒత్తిడి ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నా.. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కేటీఆర్ కొత్త ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. దీనిపై తెలంగాణ భవన్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు కావాలి…ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎమ్మెల్యేలు కేటీఆర్ పై ఒత్తిడి చేస్తున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ భవన్‌లో హాట్ టాపిక్. త్వరలో బడ్జెట్ సమావేశాలు […]
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త ఒత్తడిని ఎదుర్కొంటున్నారట. చేపట్టిన ప్రతీ టాస్క్‌ని వందశాతం నెరవేరుస్తున్న కేటీఆర్‌పై ఒత్తిడి ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నా.. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కేటీఆర్ కొత్త ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. దీనిపై తెలంగాణ భవన్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.
మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు కావాలి…ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎమ్మెల్యేలు కేటీఆర్ పై ఒత్తిడి చేస్తున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ భవన్‌లో హాట్ టాపిక్. త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నిధులు కేటాయించాలని కోరుతున్నారా? ఎన్నికల ముందు మున్సిపాలిటీల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే వెంటనే అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేయాలని పట్టు పడుతున్నారట.
మున్సిపల్ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లోకల్‌గా విడుదల చేసింది. స్వయంగా మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో స్థానిక సమస్యలు వాటి పరిష్కారాలపై మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎమ్మెల్యేలు మేనిఫెస్టోను ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ఎమ్మెల్యేలపై పడింది. దీంతో ఎమ్మెల్యేలంతా అటు ప్రగతి భవన్ చుట్టూ, ఇటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి మూడో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో తమ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు కోసం ఎమ్మెల్యేలు మ్యానిఫెస్టోలు చేత పట్టుకొని జిల్లా మంత్రులు, పార్టీ ముఖ్య నేతలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా స్థానిక ఎమ్మెల్యేలపైన ఒత్తిడి పెంచుతున్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం కొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడితే కొంత ఒత్తిడి తగ్గుతుందని స్థానిక నేతలు చెప్పుకొస్తున్నారు. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీ కార్పొరేషన్‌లో పర్యటన సందర్భంగా కేటీఆర్ హామీ ప్రకారం ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు రానందున.. ఈ బడ్జెట్లో అయిన ఒక్కొక్క మున్సిపాలిటీకి పెద్ద మొత్తంలో కేటాయిస్తే పనులు ప్రారంభించవచ్చని ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతల దృష్టికి తీసుకు వెళ్తున్నారట.
ఇక పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు ఇంకా ప్రారంభించలేదు. దీంతో తమపై ఒత్తిడి పెరుగుతుందని.. ఈసారి బడ్జెట్‌లో నిధులు విడుదల చేయాలని కేటీఆర్‌ను నేతలు కోరుతున్నారట. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా పై ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ బాగా ఉందని చెబుతున్న గులాబీ పార్టీ ముఖ్య నేతలు.. ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.