తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో గల్ఫ్ దేశాల పర్యటనకు వెళ్ళనున్నారు. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో సాధించిన థంపింగ్ విక్టరీ తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ స్వయంగా గల్ఫ్ పర్యటనకు వెళ్ళనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో వేళ్ళూనుకుపోయిన గల్ఫ్ వలస కల్చర్‌ను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు.
గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్న తెలంగాణ ప్రజల సంఖ్య గతంలో కంటే పెద్దగా తగ్గింది లేదు. తెలంగాణ ఉద్యమకాలంలో బొగ్గుబాయి, ముంబయి, దుబాయి అంటూ స్వరాష్ట్రం వస్తే.. వలస బతుకులు బాగుపడతాయని చెప్పిన కేసీఆర్ ఆ లక్ష్యసాధన కోసం గల్ఫ్ దేశాల్లోపర్యటించాలని తలపెట్టినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోనే మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు దొరుకుతున్నప్పడు.. గల్ఫ్ దేశాలకు వెళ్ళి తిప్పలు పడాల్సిన అవసరం ఏముందని సీఎం ప్రశ్నించారు.
తెలంగాణ వాసులు అత్యధికంగా వలస వెళుతున్న దేశాల్లోనే తాను పర్యటిస్తానని, ఇక్కడి ఉపాధి, ఉద్యోగవకాశాలను వివరించి, తిరిగి స్వరాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు.