శాసనమండలిలో తీవ్ర ఘర్షణ, కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు, డిప్యూటీ ఛైర్మన్‌ను సీటు నుంచి లాగేసి, ఆ సీట్లో కూర్చున్న వైనం

పెద్దలు, వివిధ రంగాల నిష్ణాతులు కొలువుతీరిన పెద్దల సభలో ముష్టిఘాతాలు, పిడిగుద్దులు రాజ్యమేలాయి. పవిత్రమైన శాసన మండలి సాక్షిగా పెద్దలు సైతం పోట్లాటలకు,..

శాసనమండలిలో తీవ్ర ఘర్షణ, కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు, డిప్యూటీ ఛైర్మన్‌ను సీటు నుంచి లాగేసి, ఆ సీట్లో కూర్చున్న వైనం

Updated on: Dec 15, 2020 | 1:25 PM

పెద్దలు, వివిధ రంగాల నిష్ణాతులు కొలువుతీరిన పెద్దల సభలో ముష్టిఘాతాలు, పిడిగుద్దులు రాజ్యమేలాయి. పవిత్రమైన శాసన మండలి సాక్షిగా పెద్దలు సైతం పోట్లాటలకు, కొట్లాటలకు దిగారు. తీవ్ర ఘర్షణ వాతావరణంలో అసలేంజరుగుతోందో అర్థంకాని పరిస్థితులు తలెత్తాయి. ఒకదశలో వివాదం పీక్స్ కి చేరింది. అంతే.. పోడియం దగ్గరకు హుటాహుటీన వెళ్లి డిప్యూటీ ఛైర్మన్‌ను సీటు నుంచి లాగేసి, ఆ సీట్లో కూర్చున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ పాటిల్. దీంతో పెద్దల సభ లోపల మాటల యుద్ధం, తోపులాట సీన్లు చరమాంకానికి చేరడంతో సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు ఛైర్మన్.

ఈ సీన్ అంతా క్రియేట్ అయింది కర్ణాటక శాసనమండలిలో. ప్రభుత్వ బిల్లులను అడ్డుకుంటున్నందుకు బీజేపీ, మండలి ఛైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ సమయంలో సీటులో బీజేపీకి చెందిన డిప్యూటీ ఛైర్మన్ ధర్మె గౌడ్ ఉన్నారు. అవిశ్వాస తీర్మానంతో ఆగ్రహం చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, డిప్యూటీ చైర్మన్‌ ధర్మె గౌడను సీటు నుంచి లాగేసి, ఆ సీట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ పాటిల్ కూర్చున్నారు. కట్ చేస్తే,   ప్యానెల్‌లో కూడా లేని పాటిల్ ఛైర్మన్ సీట్లో కూర్చోవడంతో అధికార బీజేపీ ఎమ్మెల్సీల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో ఛైర్మన్ ప్రతాప్ చంద్ర శెట్టి (కాంగ్రెస్)కి వ్యతిరేకంగా బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో,  సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రతాప్ చంద్ర శెట్టి ప్రకటించారు. అయినాకాని సభలో శాంతియుత పరిస్థితి రాలేదు.  ఇంకా శాసనమండలిలో కోలాహల వాతావరణం కొనసాగుతూనే ఉంది.