
మరి కొద్దిరోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కరోనా విలయ తాండవం చేయడం.. సినీ, క్రీడా దిగ్గజాలు మరణించడం, అనేక ప్రమాదాలు సంభవించడం 2020 అంటే వణుకుపుట్టేలా చేసింది. వచ్చే ఏడాదైనా బాగుండాలని అంతా కోరుకుంటున్నారు. ఇక న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు ప్రధాననగరాలు ముస్తాబవుతాయి. హోటల్స్, రెస్టారెంట్స్ , పబ్బులు ఇలా అన్ని సిద్దమవుతాయి. ప్రజలు ఆనందంలో మునిగి తేలుతూ కొత్తసంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి రెడీ అవుతారు.
అయితే ఈసారి నూతన సంవత్సరం వేడుకల పై ఆంక్షలు విధిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్స్ , డ్యాన్స్ బార్లు అన్నింటి పై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి దృష్ట్యా డిసెంబర్ 30 నుంచి నాలుగు రోజులపాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇక క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలలో పలు నిబంధనలు పాటించాలంటూ మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఈ వేడుకల్లో పర్యావరణానికి హాని చేయని టపాసులను మాత్రమే కాల్చాలని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది.